JC Prabhakar: ఇసుక రీచ్‌ను బంద్ చేసే వరకు వదిలే ప్రసక్తే లేదన్న జేసీ
ABN , First Publish Date - 2023-02-09T11:33:37+05:30 IST
జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం ఆందోళనకు దిగారు.
అనంతపురం: జిల్లాలోని పెద్దపప్పూరు మండలం పరిధిలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌కు వ్యతిరేకంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Tadipatri former MLA and municipal chairman JC Prabhakar Reddy) గురువారం ఆందోళనకు దిగారు. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు (YCP Leaders) వేల టిప్పర్లు ఇసుక తరలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక యదేచ్చగా రాత్రి పగలు తరలిస్తున్నా జిల్లా కలెక్టర్ గాని, మైనింగ్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పెద్దపప్పూరులో ఇసుకరీచ్‌ను బంద్ చేసే వరకు వదిలే ప్రసక్తి లేదని జేసీ ప్రభాకర్ (JC Prabhakar Reddy) హెచ్చరించారు. అధికారులు నిబంధనలు పాటించకుండా వైసీపీ నేతలకు కాసులు వర్షం కురిపించేలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆందోళనలో భాగంగా ఇసుక రీచ్ నుంచి బయటికి వస్తున్న లారీలు, టిప్పర్లను అడ్డుకున్న జేసీ అడ్డుకున్నారు. ఇసుక తరలింపుకు సంబంధించిన అనుమతులు చూపే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఇసుక రీచ్ వద్దకు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్‌ను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
యదేచ్ఛగా ఇసుక దోపిడి....
కాగా... తాడిపత్రి నియోజవర్గంలోని పెన్నా నది నుంచి వైసీపీ నేతల ఇసుక తరలింపు యదేచ్ఛగా కొనసాగుతోంది. రోజుకు వందకు పైగా లారీలో ఇసుకను తరలిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. వైసీపీలోకి ఓ కీలక నేత అండతోనే ఇసుక దోపిడీ దారులు మరింత రెచ్చిపోతూ ఇసుకను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో సర్వత్రా విమర్శలు తావిస్తోంది. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే దోపిడీ దారులు ఇసుకను దోచుకుంటున్నారు. పెద్దాపప్పూరు మండలం ధర్మపురం గ్రామ పరిధిలోని పెన్నా నదిలో సర్వే నెంబర్ 1లోని నాలుగు ఎకరాలలో ఇసుకను తవ్వుకునేందుకు మైనింగ్ అధికారులు అనుమతులిచ్చారు. ఇక్కడ ఉన్న రీచ్ నుంచి 61,500 టన్నుల ఇసుకను తవ్వుకునేందుకు ఈనెల 22 వరకు గడువు విధించారు. అయితే అధికారులు అనుమతిలిచ్చిన ప్రాంతంలో కాకుండా మరో చోట దోపిడీ దారులు ఇసుకను తవ్వుకుంటున్నారు. పెద్దాపప్పూరులో ఇసుక నాణ్యతగా ఉండటంతో కొందరు వైసీపీ నేతలు అక్కడ తవ్వకాలు చేపట్టగా.. దీనిపై అనేక పత్రికలో వార్తలు రావడంతో.... అధికారులు అక్కడకు చేరుకుని తవ్వకాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో కొద్దిరోజులు మౌనంగా ఉన్న దోపిడీ దారులు తిరిగి ఇసుక తవ్వకాలను చేపట్టారు. అయితే తాడిపత్రికి చెందిన ఓ కీలక నేత అండదండలతోనే ఇసుక రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.