Anantapuram: తుమ్మల వంశీ ఆత్మహత్య వెనుక వైసీపీ నేత..

ABN , First Publish Date - 2023-06-18T08:28:18+05:30 IST

అనంతపురం: ప్రింటింగ్ ప్రెస్ యజమాని తుమ్మల వంశీ ఆత్మహత్య వెనుక కీలక వైసీపీ నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కుట్ర కుతంత్రాలతో భూమిని అమ్మిన వారసులను వంశీపైకి వైసీపీ నేత ఉసిగొల్పారు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ విష్ణు, రౌడీ షీటర్లతో కలిపి కథ వైసీపీ నేత నడిపారు.

Anantapuram: తుమ్మల వంశీ ఆత్మహత్య వెనుక వైసీపీ నేత..

అనంతపురం: ప్రింటింగ్ ప్రెస్ యజమాని తుమ్మల వంశీ ఆత్మహత్య వెనుక కీలక వైసీపీ నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కుట్ర కుతంత్రాలతో భూమిని అమ్మిన వారసులను వంశీపైకి వైసీపీ నేత ఉసిగొల్పారు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ విష్ణు, రౌడీ షీటర్లతో కలిపి కథ వైసీపీ నేత నడిపారు. వైసీపీ నేత ఆగడాలను అడ్డుకున్న అప్పటి రూరల్ సీఐను పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించి తిమ్మాపురం దూదేకుల ఖాసిం, రౌడీ షీటర్లు సర్దార్, బుల్లెట్ బాబాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆర్ఐ విష్ణు పరారీలో ఉన్నాడు. పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులు విష్ణును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. తుమ్మల వంశీ సూసైడ్ నోట్‌లోని ఓ పేజీలో వైసీపీ కీలక నేత పేరు ఉంది. ఆ పేజీని పోలీసులు మాయం చేశారు.

వివరాల్లోకి వెళితే..

ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడు వంశీ ఆత్మహత్యకు కారణమైన భూమి ఆక్రమణ వెనుక పెద్ద తలకాయలే ఉన్నట్లు తెలుస్తోంది. కబ్జాదారులతో పోరాడలేక బాధితుడు బలవన్మరణానికి పాల్పడినట్లు స్పష్టమౌతోంది. గుంటూరు జిల్లా చిన్న పలకలూరుకు చెందిన తుమ్మల వంశీ, కమలానగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఉరివేసుకున్న విషయం తెలిసిందే. కురుగుంట సర్వే నంబరు 102-1బిలో 5.68 ఎకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుందని, తన చావుకు నలుగురు కారణమని వంశీ సూసైడ్‌ నోట్‌ రాశాడు. తిమ్మాపురం దూదేకుల ఖాశీం, తిమ్మాపురం సర్దారు (రౌడీషీటర్‌), తిమ్మాపురం బుల్లెట్‌ బాబా (రౌడీషీటర్‌), ఆర్‌ఐ విష్ణు పేర్లను ప్రస్తావించాడు. ఈ నలుగురి వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉండి, వ్యవహారం నడిపినట్లు సమాచారం.

తెర వెనుక కీలక నేత

వంశీ ఆత్మహత్యకు కారణమైన భూ వివాదం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు తెలుస్తోంది. ఆ భూమిపై కన్నేసిన అధికారపార్టీకి చెందిన కీలక నేత అంతా తానై వ్యవహారం నడిపినట్లు సమాచారం. తెర ముందుకు ఆయన గతంలో భూమి అమ్మిన వ్యక్తి వారసులను దించాడు. కురుగుంట సర్వే నంబరు 102-1బిలో మొత్తం మొత్తం 31.31 ఎకరాల భూమి ఉంది. వంశీ లేఖలో పేర్కొన్న తిమ్మాపురం బుల్లెట్‌ బాబా పూర్వీకులు మరొకరికి ఆ భూమిని విక్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలో సర్వే నంబరు 102-1బిలో 5.68 ఎకరాల భూమి తమదేనని అతను ముందుకొచ్చాడని తెలిసింది. కొందరు రెవెన్యూ అధికారులు అతనితో కుమ్మక్కై, అప్పట్లోని డైక్లాట్‌లు, బోగస్‌ డాక్యుమెంట్లతో ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. కబ్జా ఎత్తుగడలో భాగంగా ఆ భూమిలో షెడ్డు నిర్మించినట్లు సమాచారం.

Updated Date - 2023-06-18T08:28:18+05:30 IST