CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో అరెస్ట్..

ABN , First Publish Date - 2023-04-14T20:22:10+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఉదయ్ కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.

CBI: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో అరెస్ట్..

హైదరాబాద్‌: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఉదయ్ కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఉదయ్ కుమార్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చినట్లు సీబీఐ (CBI) అధికారులు తెలిపారు. ఉదయ్‌కుమార్‌రెడ్డికి (Uday Kumar Reddy) న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. చంచల్‌గూడ జైలుకు ఉదయ్‌కుమార్‌రెడ్డిని తరలించామని సీబీఐ అధికారులు వెల్లడించారు.

ఉదయ్ కుమార్‌రెడ్డిని కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ఉదయ్ కుమార్‌రెడ్డి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం విచారిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది.

వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఆయన నివాసం వద్ద గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని గుర్తించినట్లు పులివెందుల మాజీ డీఎస్పీ ఆర్‌. వాసుదేవన్‌ సీబీఐకి చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా గత ఏడాది సెప్టెంబరు 1న ఆయన వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది. వివేకా మృతదేహానికి కుట్లు వేసి, కట్లు కట్టిన కాంపౌండర్లలో గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి కూడా ఒకరు. ఉదయ్‌ ఫిర్యాదు మేరకే సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదైంది. అయితే... హత్య జరిగిన రోజున వివేకా ఇంటి పరిసరాల్లో ఉదయ్‌ అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు నాటి పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ సీబీఐకి చెప్పడం గమనార్హం.

ఆయన వాంగ్మూలంలో ఏముందంటే... ‘‘2019 జూన్‌ 17 నుంచి ఈ కేసు దర్యాప్తులో నేను పాల్పంచుకున్నాను. హత్య జరిగినరోజు (2019 మార్చి 15) వేకువ జామున గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి వివేకా ఇంటి పరిసరాల్లో తచ్చాడినట్లు మొబైల్‌ లోకేషన్‌ ద్వారా తెలిసింది. ఆయనను మూడుసార్లు ప్రశ్నించగా... ప్రతిసారీ మాట మార్చాడు. మొబైల్‌ లొకేషన్‌ పరిశీలనలో ఉదయ్‌ కుమార్‌ రెడ్డి చెప్పింది నిజం కాదని తేలింది. వివేకా హత్య జరిగిన రోజు వేకువజామున 4.38 నుంచి 4.48 మధ్య బ్రిడ్జిస్టోన్‌ టైర్ల దుకాణం రోడ్డులో ఉదయ్‌ బైకుపై పదే పదే తిరగడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వివేకా మృతదేహానికి కుట్లేసి, కట్టు కట్టింది ఉదయ్‌ తండ్రే. ఈ వ్యవహారంలో ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉంది’’ అని వాసుదేవన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-14T20:25:53+05:30 IST