AP News: డీజీపీకి అచ్చెంనాయుడు లేఖ
ABN , First Publish Date - 2023-04-23T18:31:44+05:30 IST
ఎర్రగొండ పాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటనపై డీజీపీ (DGP)కి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు లేఖ రాశారు.
అమరావతి: ఎర్రగొండ పాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి ఘటనపై డీజీపీ (DGP)కి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు లేఖ రాశారు. చంద్రబాబు (Chandrababu)కు బందోబస్తు కల్పించాలని ముందే లేఖ రాసిన పట్టించుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరిలో ఎన్‌ఎస్‌జి రక్షణలో ఉన్న చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటనలో కొంతమంది పోలీసులు వైసీపీ (YCP) గూండాలతో చేతులు కలిపారని ఆరోపించారు. రాళ్లు , కర్రలు, రాడ్లతో దాడిలో పాల్గొన్నారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ గూండాలను చంద్రబాబు కాన్వాయ్ వద్దకు రానివ్వడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ అధికారుల పాత్ర ఉందని అచ్చెంనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు. మంత్రే స్వయంగా ఆందోళన, దాడుల్లో పాల్గొని గుంపులకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
మంత్రి కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని చెప్పారు. ఎన్‌ఎస్‌జీ కమాండింగ్ ఆఫీసర్, మరో ఇద్దరు కమాండర్‌లు గాయపడ్డారని అచ్చెంనాయుడు వివరించారు. ముందుగానే సమాచారం అందించినా డీజీపీ కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దాడిలో పాల్గొన్న వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన అనుచరులపై వెంటనే కేసు నమోదు చేయాలని లేఖ ద్వారా కోరారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. లేఖతో వైసీపీ నేతలకు పోలీసులు ఇస్తున్న సూచనలు , రాళుల విసురుతున్న గూండాల విజువల్స్‌ను డీజీపీకి పంపారు.