TDP: వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అనురాధ ఫైర్
ABN , First Publish Date - 2023-04-12T15:08:27+05:30 IST
కొత్త పిచ్చోడు పొద్దరెగడన్న చందంగా ఎప్పుడో ఒకసారి సీఎం బయటకొచ్చి అంకెల గారడీతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumarthi Auradha) మండిపడ్డారు.
అమరావతి: కొత్త పిచ్చోడు పొద్దరెగడన్న చందంగా ఎప్పుడో ఒకసారి సీఎం బయటకొచ్చి అంకెల గారడీతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumarthi Auradha) మండిపడ్డారు. ఈబీసీ పథకం పేరుతో మహిళల్ని పచ్చి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 సార్లు బడ్జెట్‌లు పెట్టారు, ఏనాడైనా ఒక్క రూపాయి ఈబీసీలకు కేటాయించారా? అని ఆమె ప్రశ్నించారు. ఈబీసీలకు రుణాలు లేవు, సబ్సిడీ లేవు, పించన్లు ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు (Chandrababu) హయంలో బ్రాహ్మణలుకు రూ. 280 కోట్లు ఆర్యవైశ్యులకు రూ. 50 కోట్లు క్షత్రియులకు 50 కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. 4 ఏళ్లలో అగ్రవర్ణ కార్పోరేషన్లకు రూ. 1 ఖర్చు చేశారా, ఒక్కరికైనా రుణం ఇచ్చారా?, అన్నివర్గాలకు ఇచ్చే ఫించన్లు, రేషన్ బియ్యం తప్ప ప్రత్యేకంగా ఈబీసీలకు మీరు ఇచ్చేందిటి? టీడీపీ హయాంలో స్కాలర్షిప్పులు, ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా 80 లక్షల మందికి ఇచ్చాం, మీరెంత మందికి ఇచ్చారు? అని ఆమె ప్రశ్నించారు.
ఆసరా పచ్చి మోసం 1. 14 కోట్ల మంది డ్వాక్రా మహిళలుంటే అరకొర నిధులిచ్చి వారి మద్య గొడవలు పెట్టిన నీచ చరిత్ర జగన్‌ది అని మండిపడ్డారు. సున్నా వడ్డీ రూ. 4800 కోట్లు ఇవ్వాలి, కానీ 1260 కోట్లు ఇచ్చి మహిళల్ని ఉద్దరించామనటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు సున్నావడ్డీకి కింద ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షలిచ్చారని ఆమె గుర్తుచేశారు. టీడీపీ, వైసీపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. అభయ హస్తం రూ. 2 వేలు కోట్లు, పొదుపు సొమ్ము దారి మళ్లించారని, ఆ డబ్బులు ఏమయ్యాయి?, ఇదేనా మహిళల్ని ఉద్దరించటం అంటే జగన్ రెడ్డి? అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. మహిళలపై 52 వేల నేరాలు జరిగితే ఎంతమంది నిందితులపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా సంక్షేమం చంద్రన్నతోనే సాధ్యమని ప్రజలకు అర్దమైందన్నారు.