Atchannaidu: కోర్టు ఆదేశాలను కూడా సీఐడీ పట్టించుకోదా?.. మార్గదర్శిలో సోదాలపై అచ్చెన్న ఫైర్

ABN , First Publish Date - 2023-08-22T16:41:35+05:30 IST

హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి మార్గదర్శిలో సీఐడీ సోదాలు నిర్వహిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు.

Atchannaidu: కోర్టు ఆదేశాలను కూడా సీఐడీ పట్టించుకోదా?.. మార్గదర్శిలో సోదాలపై అచ్చెన్న ఫైర్

అమరావతి: హైకోర్టు (AP Highcourt) ఆదేశాలను కూడా ఉల్లంఘించి మార్గదర్శిలో సీఐడీ (CID) సోదాలు నిర్వహిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chiefr Atchannaidu) విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో 109వ బ్రాంచ్ ప్రారంభం మార్గదర్శి నిజాయతీకి నిదర్శనమన్నారు. మార్గదర్శి సంస్థ (Margadarshi) చందాదారుల నమ్మకం పొందిందని తెలిపారు. మార్గదర్శి అంటే నమ్మకం, నిజాయతీ, పారదర్శకత అని చెప్పుకొచ్చారు. మార్గదర్శి సంస్థపై జగన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా జగన్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలా సీఐడీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.


మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెల్లడించే వరకు మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచిల్లో సోదాలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. అయితే కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి రాత్రి వేళల్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తుండటం జగన్ రెడ్డి విధ్వంస విధానాలకు నిదర్శనమన్నారు. ఈ విషయంపై న్యాయస్థానం వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల విశ్వాసం, మన్ననలు పొందిన మార్గదర్శిని దెబ్బతీయలేరని తెలిపారు. చందాదారులు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకు రాకపోయినా సీఐడీ ఒత్తిడి చేస్తోందన్నారు. బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. ప్రశ్నిస్తున్న వారి నోరు నొక్కాలనే కుటిల పన్నాగాలు నెరవేరబోవని స్పష్టం చేశఆరు. ఇప్పటికైనా మార్గదర్శి సంస్థపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని అచ్చెన్నాయుడు హితవుపలికారు.

Updated Date - 2023-08-22T16:41:35+05:30 IST