AP Politics : వలంటీర్ వ్యవస్థపై అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-17T22:21:28+05:30 IST
సోమవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు జీతం..
వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థకు (Volunteer System) టీడీపీ (TDP) వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు. సోమవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు జీతం వైసీపీ (YSRCP) పార్టీ ఇవ్వటం లేదని ప్రజాధనం ద్వారా జీతాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు వారధిగా ఉండాలని.. జగన్, వైసీపీకి వాలంటీర్లు ఊడిగం చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘వ్యక్తిగత డేటా అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు?. సంక్షేమ పథకాల కోసం అనగానే వేలిముద్ర వేస్తే.. రేపు జగన్‌రెడ్డి (Jagan Reddy) మీ ఆస్తులు లాక్కుంటారు. ఏపీని రావణకాష్టంగా మార్చాలని జగన్‌రెడ్డి చూస్తున్నారు. ప్రజలు మేలుకోకపోతే రాష్ట్రం వల్లకాడు అవుతుంది’ అని అచ్చెన్న విమర్శించారు.
చంద్రబాబు ఇలా..!
కాగా.. వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌తో ఏపీలో రచ్చ రచ్చ జరుగుతుండగా ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కూడా స్పందించారు. వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమని మండిపడ్డారు. వలంటీర్లు పౌరసేవకు పరిమితం కావాలని.. అలా కాదని రాజకీయ జోక్యం చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వ్యక్తిగత సమాచార సేకరణ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వలంటీర్ల సేవలను పరిశీలిస్తామని బాబు మాటిచ్చారు.