BRS MLA Rajaiah: సరిగ్గా ఇళ్లు కూడా లేని కడియంకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?
ABN , First Publish Date - 2023-07-09T18:25:10+05:30 IST
దొంగచాటుగా సమావేశం పెట్టడం ఎందుకని, దమ్ముంటే రచ్చబండల దగ్గర చర్చకు సిద్ధమా అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ చేశారు.
వరంగల్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై (Kadiam Srihari) స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య (BRS MLA Rajaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి తిమింగలంటూ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాకముందు సరిగా ఇళ్లు కూడా లేని కడియంకు రూ. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్, మలేషియాలో రూ. వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
దొంగచాటుగా సమావేశం పెట్టడం ఎందుకని, దమ్ముంటే రచ్చబండల దగ్గర చర్చకు సిద్ధమా అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ చేశారు. సమయమిస్తే ఆయన అవినీతిని బయటపెడతానంటూ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం రంగులు మార్చే ఊసరవెల్లి అంటూ మండిపడ్డారు. "స్టేషన్ ఘనపూర్ నా గడ్డ - నా అడ్డ.'' అంటూ ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు.
కడియం శ్రీహరితో అమితుమీకి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. శ్రీహరి కులంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోందని, ఆయన తల్లి పద్మాశాలి కులస్థురాలంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లు దుర్వినియోగం చేస్తున్నారని వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లుగా నియోజకవర్గంలో కనిపించని ఆయన ఇప్పుడు తిరుగుతున్నారని విమర్శించారు. "కడియం శ్రీహరికి అహం ఎక్కువ. ఆయన్ను దళిత దొర అని పిలుస్తారు. దమ్ముంటే చూసుకుందాం రా... దేనికైనా సై." అంటూ కడియంకు రాజయ్య సవాల్ చేశారు.