Chandrababu: ఉమ్మడి పశ్చిమలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2023-05-03T19:30:06+05:30 IST

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District)లో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిశీంచి రైతులతో ముఖాముఖి మాటాడనున్నారు.

Chandrababu: ఉమ్మడి పశ్చిమలో చంద్రబాబు పర్యటన

ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District)లో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిశీంచి రైతులతో ముఖాముఖి మాటాడనున్నారు. ఇప్పటికే దాదాపు 25 వేలకు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం అకాల వర్షాలకు దెబ్బతింది. వందలాది మంది రైతులు నష్టాల పాలయ్యారు. కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు (Ministers MLAs) గాని పరామర్శించిన పాపాన పోలేదు. జిల్లా స్థాయి అధికారులు ఆ వైపు చూడనే చూడలేదు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉమ్మడి పశ్చిమలో రైతులు విలవిలలాడిపోయారు. ఈ తరుణంలోనే చంద్రబాబు ఏలూరు జిల్లా పరిధిలోని ఉంగుటూరు మండలం నాచుగుంటలో, పశ్చిమగోదావరి జిల్లా నందమూరులో రైతులను పరామర్శిస్తారు. తడిసి ముద్దయిన వరి పొలాలను సందర్శిస్తారు. రైతులతో నేరుగా భేటీ అవుతారు. ఈ మేరకు తెలుగుదేశం కార్యాచరణ ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమలో చంద్రబాబు పర్యటనకు రైతులంతా సంఘీభావం ప్రకటించేలా కార్యచరణ సిద్ధం చేశారు. ఈ రెండు జిల్లాల్లోనూ రైతులను పరామర్శించి ఆ తర్వాత తణుకులో చంద్రబాబు రాత్రి బస చేస్తారు. శుక్రవారం ఉదయం ఆయన రాజమండ్రి బయలుదేరి వెళ్తారు.

గత నాలుగేళ్లుగా వరుస విపత్తులు రైతులు బాగా కుంగదీశాయి. పంట పండినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. విపత్తులతో వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సాగు పెట్టుబడులకు అదనంగా కౌలు చెల్లించే కౌలురైతులకు ఈ విపత్తులు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి అంచనాలే తప్ప.. వాస్తవంగా దిగుబడి ఎంతొచ్చింది? రైతుకు మిగిలిందెంత? అనేది పాలకులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవట్లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కాగా, మంగళవారం కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో మూడ్రోజులు వర్ష సూచన, వచ్చే వారం వాయుగుండం హెచ్చరికలు రైతుల గుండెల్లో పెను తుఫాన్‌ సృష్టిస్తోంది.

Updated Date - 2023-05-03T19:30:06+05:30 IST