Yuvagalam: నేను మాట్లాడితే.. ప్యాలెస్ పిల్లికి వణుకు
ABN , First Publish Date - 2023-02-24T02:27:31+05:30 IST
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌ఆర్, జగన్‌రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేశారు.
బీసీలను బానిసల్లా చూస్తున్న జగన్
ఆర్‌ఎంపీ బోర్డు ఏర్పాటు చేస్తాం
జగన్‌కు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నా..ఆయన తెచ్చిన కంపెనీ ముందు సెల్ఫీ దిగాలి
25వ రోజు పాదయాత్రలో నారా లోకేశ్ సవాల్
తిరుపతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌ఆర్, జగన్‌రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేశారు. ఏనాడూ వారిని అడ్డుకోలేదు. ఇప్పుడు నేను ఒక చిన్న గ్రామంలో మాట్లాడినా ప్యాలెస్ పిల్లి వణికిపోతోంది. నేను మాట్లాడితే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారనే భయం. నువ్వు ఎంత అడ్డుకుంటే నేను అంత ఎక్కువ మాట్లాడతా..’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. 25వ రోజైన గురువారం యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తిరుపతి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. రేణిగుంటలో యాదవ సామాజికవర్గం, ఆర్‌ఎంపీలతో లోకేశ్ ముఖాముఖి మాట్లాడారు.
చర్చకు సిద్ధమా?
‘బీసీలను బానిసలుగా చేసుకోవాలని జగన్ రెడ్డి భావిస్తున్నాడు. టీడీపీ హయాంలో యాదవుల సంక్షేమానికి రూ.278 కోట్లు ఖర్చుచేశాం. వైసీపీ పాలనలో యాదవుల సంక్షేమానికి ఖర్చు చేసింది సున్నా. బీసీల సంక్షేమానికి ఎవరు ఎంత ఖర్చు చేశారో చర్చకు నేను సిద్ధం. వైసీపీ నేతలు సిద్ధమా..?’ అని లోకేశ్ సవాల్ విసిరారు. ‘429 జీవోలో సవరణలు తీసుకొచ్చి అమలు చేస్తాం. ఆర్‌ఎంపీ బోర్డు ఏర్పాటుచేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని లోకేశ్ ఆర్‌ఎంపీలకు హామీ ఇచ్చారు.
‘జోహో’ తెచ్చిందీ నేనే జగన్ రెడ్డీ!
‘జగన్ రెడ్డీ.. ఇదిగో నేను రేణిగుంటకు తెచ్చిన జోహో ఐటీ కంపెనీ. ఇక్కడ పనిచేస్తున్న నా చెల్లెమ్మల కళ్లలో ఆనందం చూడు. నీ హయాంలో ఒక్క కంపెనీ వచ్చిందా..?’ అని లోకేశ్ ప్రశ్నించారు. రేణిగుంటలో పాదయాత్ర సందర్భంగా జోహో ఐటీ కంపెనీ ముందు సెల్ఫీ దిగుతూ.. ‘టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీల ముందు నేను సెల్ఫీ దిగుతాను. జగన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ కంపెనీలు తప్ప ఏమైనా ఉంటే సెల్ఫీ దిగి పోస్ట్ చేయాలని కోరుతున్నాను’ అని సెల్ఫీ చాలెంజ్ విసిరారు. కాగా.. శ్రీకాళహస్తి నియోజకవర్గం నీలిసానిపేటలో లోకేశ్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నిలబడిన స్టూల్‌ను సీజ్ చేశారు. గాజులమండ్యం ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో అడ్డుపడ్డారు. ‘రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను తెలుసుకోవడానికి వస్తే నన్ను అడ్డుకుంటున్నారు. నేను ప్రజలతో మాట్లాడే హక్కు రాజ్యాంగం ద్వారా వచ్చింది. నా హక్కులు హరించే అధికారం మీకు లేదు’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా 25వ రోజు పాదయాత్ర ప్రారంభించే ముందు దివంగత నేత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా లోకేశ్ ఆయనకు నివాళులర్పించారు.
ఇంకెంతమంది గిరిబిడ్డలు బలవ్వాలి జగన్‌రెడ్డీ..?
శ్రీకాళహస్తి నియోజక వర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఈరోజు తిరుపతిలో అడుగుపెట్టాను. వారం రోజుల పాటు సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరించిన శ్రీకాళహస్తి ప్రజలకు నా కృతజ్ఞతలు. సకాలంలో వైద్యసేవలందక మరో పసిగుడ్డు కన్నుమూసిందని ఈ రోజు మీడియాలో వచ్చిన వార్త కలచివేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పనసబంద గ్రామానికి చెందిన సోదరి భానుకి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం గర్భశోకాన్ని మిగిల్చింది. నీ చేతగాని పాలనకు ఇంకా ఎంతమంది చనిపోవాలి జగన్మోహన్ రెడ్డీ!? ఈరోజు పాదయాత్ర దారిలో రేణిగుంట వద్ద నేను ఏర్పాటుచేసిన జోహో ఐటీ కంపెనీ వద్ద ఉద్యోగులను కలిశాను. వారి కళ్లల్లో ఆనందాన్ని చూడగానే మనసు పులకించింది. పాదయాత్రలో విద్యార్థి జేఏసీ నాయకుడు హేమాద్రి యాదవ్ నన్ను కలిశారు. ‘వైసీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడం వల్ల వేలాదిమంది పేద విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో నిలిచిపోయాయి. దీంతో చదువు పూర్తయినా ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వెళ్లలేకపోతున్నాం’ అని ఆవేదన చెందాడు. పాలన అంటే దోచుకోవడం, దాచుకోవడమే కాదు.. విద్యార్థులు, యువతీయువకుల కష్టాలను కాస్త పట్టించుకోండి ముఖ్యమంత్రీ! పాదయాత్ర గురువారం 15.5 కిలోమీటర్లు సాగి తిరుపతి నగరం శివారులో విడిది కేంద్రానికి చేరింది. లోకేశ్ ఇప్పటివరకు 344.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.