BJP-Janasena: చాలా కాలం తర్వాత తొలిసారి బీజేపీతో నిరసనలో పాల్గొన్న జనసేన
ABN , First Publish Date - 2023-08-10T13:28:26+05:30 IST
సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది.
తిరుపతి: సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ మహాధర్నాకు దిగింది. తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది. గురువారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో (BJP Leader Vishnuvardhan Reddy) పాటు, ఉభయ పార్టీల నేతలు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు. కాగా.. రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్‌లోనే నేతలు ధర్నాను కొనసాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్‌తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన సహా మరో 50 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మేమేమైనా ఉగ్రవాదులమా...? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని సర్పంచ్‌ల ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయలను జమచేసింది. సర్పంచ్‌లకు కేటాయించిన నిధులను సీఎం జగన్ పక్కదారి పట్టించారు. 13 వేల మంది సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు’’ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.