Lokesh Padayatra : నేనున్నానంటూ!
ABN , First Publish Date - 2023-01-29T02:40:09+05:30 IST
పొలాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి సమస్యల్ని వివరించారు. మహిళలు తమ కష్టాలను చెప్పుకొన్నారు.
రెండో రోజూ ఉత్సాహంగా లోకేశ్ పాదయాత్ర
అన్నివర్గాలను కలుస్తూ, పలకరిస్తూ ముందుకు
రద్దీ తక్కువ రోడ్లపై చకచకా నడక
‘యువగళం’తో జనం, నేతల అడుగులు
కిక్కిరిసిపోయిన పాదయాత్ర దారులు
సమస్యలు చెప్పుకొన్న రైతులు, బీసీలు
ఫీజు రీయింబర్స్ కావడంలేదన్న విద్యార్థులు
గుడుపల్లె నుంచి శాంతిపురం వరకు యాత్ర
మొత్తం 9.3 కిలోమీటర్లు నడిచిన యువనేత
నేడు కుప్పం నియోజకవర్గంలో యాత్ర పూర్తి
చిత్తూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పొలాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి సమస్యల్ని వివరించారు. మహిళలు తమ కష్టాలను చెప్పుకొన్నారు. ఆయా కుల సంఘాలు తమపై ప్రభుత్వ కక్ష సాధింపు గురించి ఆవేదన చెందారు. వారందరినీ ఓదార్చుతూ, ‘నేనున్నాను’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు తన పాదయాత్రను కొనసాగించారు. ‘యువగళం’ యాత్రకు స్థానికులతో పాటు బయటి ప్రాంతాల నుంచీ విపరీతంగా జనాలు హాజరుకావడంతో దారులు జనసంద్రమయ్యాయి. లోకేశ్ మొదటి రోజు బస చేసిన గుడుపల్లె మండలం నలగామపల్లెలోని పీఈఎస్ ప్రాంగణం నుంచి శనివారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభమైంది. మొత్తం 9.3 కిలోమీటర్లు నడిచి శాంతిపురం సమీపంలో యాత్రకు విరామం ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభంలో పీఈఎస్ సమీపంలో నిర్మాణంలో ఆగిపోయిన వాల్మీకీ, కురుబ కమ్యూనిటీ హాళ్లను లోకేశ్ పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.10 కోట్లతో ప్రారంభించిన నిర్మాణపనులను వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపేసిందని అక్కడి బీసీలు లోకేశ్ వద్ద ఆవేదన చెందారు. ఇక్కడి స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేయడంతో పాటు ఈ భవనాలను బెల్టు షాపులుగా మార్చేశారని ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు మీద నేరుగా కోపాన్ని చూపించలేక, ఈ భవన నిర్మాణాల్ని ఆపేసి కక్ష సాధిస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు.
విద్యా, వసతి దీవెనలేవీ?
లోకేశ్‌ను కుప్పం డిగ్రీ కాలేజీ విద్యార్థులు.. పాదయాత్రలో కలుసుకున్నారు విద్యా దీవెన, వసతి దీవెన తమకు అందడం లేదని, చేతి నుంచి డబ్బులు చెల్లిస్తున్నామని, కొత్త కోర్సులు పెట్టినా ల్యాబులు ఏర్పాటు చేయలేదని ఆయనకు చెప్పారు. తాగునీటి సౌకర్యం కూడా లేదని ఫిర్యాదు చేయగా, తమ ప్రభుత్వం వచ్చాక అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థులు...లోకేశ్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అనంతరం గణేశ్‌పురం క్రాస్‌లో మహిళలు, రైతులతో లోకేశ్ మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో బతుకు భారమవుతోందని, వ్యవసాయ మోటార్లకు మీటర్లను బలవంతంగా అమర్చుతున్నారని ఫిర్యాదు చేశారు. కడపల్లెలో పొలంలో పనులు చేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ, మునిరత్నాలను లోకేశ్ కలిశారు. మొక్కజొన్న, టమోట పంటలు సాగు చేసి నష్టపోయామని వారు వాపోయారు. రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుచేసి గిట్టుబాటు ధర కల్పిస్తామన్న జగన్... ఆ విషయమే పట్టించుకోవడం లేదని లోకేశ్ ఆగ్రహించారు.
బీసీలతో ముఖాముఖి
కడపల్లెలో బీసీలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. జగన్ ప్రభుత్వంతో బీసీలు పడుతున్న ఇబ్బందులను వివిధ కులాల ప్రతినిధులు లోకేశ్ దృష్టికి తెచ్చారు. వారి సమస్యలు విని లోకేశ్ చలించిపోయారు. వాల్మీకీ, బోయలను ఎస్టీల్లో చేరుస్తానన్న హామీని జగన్ పట్టించుకోలేదని లోకేశ్ అన్నారు. రిజర్వేషన్లను తగ్గించి సుమారు 16,500 మంది బీసీలకు పదవుల్ని దూరం చేశారని ఆగ్రహించారు. వైసీపీ పాలనలో 26 మంది బీసీలను దారుణంగా చంపేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలంతా ఆర్థికంగా నిలబడేలా స్వయం ఉపాధి కోసం ప్రోత్సాహం ఇస్తామని హామీనిచ్చారు.
టమాటా మార్కెట్‌లో రైతులతో భేటీ
కనుమలదొడ్డి టమాట మార్కెట్‌లో రైతులతో లోకేశ్ భేటీ అయ్యారు. గిట్టుబాటు ధర లేక టమోటను రోడ్ల మీద పడేస్తున్నామని రైతులు వాపోయారు. డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని లేకుండా చేశారన్నారు. వారి ఆవేదనను పంచుకుంటూ.. కోర్టులో దొంగతనం చేసినోడు మన వ్యవసాయశాఖ మంత్రి అని, సీబీఐ చుట్టూ తిరుగుతూ రైతుల్ని మరచిపోయారని లోకేశ్ ఆగ్రహించారు. గెలిచాక కచప్ (టమోటా సాస్) ఫ్యాక్టరీలను పెడతానన్న జగన్ ఇప్పుడు ఆ విషయం మరచిపోయారన్నారు. అధికారంలోకి వచ్చాక టమాట రైతులకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యతను తాను తీసుకుంటానని లోకేశ్ హామీనిచ్చారు.