Tirumala Video: టీటీడీ మీ అబ్బ జాగీరా? కన్నీళ్లు పెట్టుకున్న శ్రీవారి భక్తుడు
ABN , First Publish Date - 2023-08-16T19:24:05+05:30 IST
తిరుమలలో సౌకర్యాలపై ఓ భక్తుడు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తిరుమల గర్భగుడి మీదుగా విమానాలు వెళ్లడం, లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గడం, సాధారణ దర్శనాలకు కాకుండా ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటి అంశాలను ఓ భక్తుడు సూటిగా ప్రశ్నించాడు. తిరుమల మీ అబ్బ జాగీరా అంటూ టీటీడీ అధికారులను నిలదీశాడు.
కలియుగ దైవం కొలువుండే తిరుమల ఏడుకొండలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. అయితే తిరుమలకు వెళ్లే అలిపిరి నడక దారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి అంశం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిరోజూ భక్తుల నుంచి కోట్లకు కోట్లు ఆదాయం ఆర్జించే టీటీడీ భక్తుల రక్షణ కోసం సరైన చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా టీటీడీ నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ ఘటన జరగడం కాక రేపింది. అందులోనూ భూమన మతంపై భారీ స్థాయిలో సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అంతలోనే విషాదం జరగడం అందరినీ ఆలోచింపచేస్తోంది.
తిరుమల కొండపై భక్తుల రద్దీ ప్రతిరోజూ ఉంటుంది. అందుకే శ్రీవారికి రోజూ రూ.2 కోట్లకు తక్కువ హుండీ ఆదాయం అనేదే ఉండదు. ఇంకా ఆర్జిత సేవలు, ప్రసాదాలు, దర్శనాల ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఇవి కాక భారీ స్థాయిలో అన్నదానానికి విరాళాలు వస్తూనే ఉంటాయి. ఇంతటి ఆదాయం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు భక్తుల రక్షణ చేపట్టే బాధ్యత టీటీడీదే. కానీ తిరుమల నడకదారిలో ఇటీవల నిత్యం భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వన్యప్రాణుల నుంచి రక్షించే ఫెన్సింగ్ లేకపోవడంతో భక్తులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కొండపైకి వెళ్తున్నారు. ఇటీవల అభం శుభం తెలియని చిన్నారి చిరుతపులి దాడికి గురై మృత్యువాత పడటం అందరినీ కలిచివేసింది. దీంతో టీటీడీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. తాజాగా ఓ భక్తుడు టీటీడీని ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: MVV Satyanarayana: జగన్‌పై అందుకే కేసులు.. వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్ వైరల్
సదరు వీడియోలో తిరుమలలో సౌకర్యాలపై భక్తుడు ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తిరుమల గర్భగుడి మీదుగా విమానాలు వెళ్లడం, లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గడం, సాధారణ దర్శనాలకు కాకుండా ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటి అంశాలను ఓ భక్తుడు సూటిగా ప్రశ్నించాడు. తిరుమల మీ అబ్బ జాగీరా అంటూ టీటీడీ అధికారులను ప్రశ్నించాడు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నడకదారిలో ఫెన్సింగ్ వేయించలేరా అంటూ నిలదీశాడు. భక్తుల ప్రాణాలతో ఆడుకుంటున్న టీటీడీ ఛైర్మన్, ఈవోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాడు. రాజకీయ నేతలు టీటీడీ ఛైర్మన్‌గా ఉండేందుకు వీలు లేదని అభిప్రాయపడ్డాడు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఇదే రూల్ పాటించాలన్నాడు. టీటీడీ పదవుల్లో ఐఏఎస్ అధికారులు మాత్రమే ఉండాలని కోరాడు. హిందువులకు తిరుమలలో అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దుర్మార్గ పాలకుల వల్లే కరోనా లాంటి ఉపద్రవం కారణంగా తిరుమల ఆలయం మూతపడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దర్శనాల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బ్లాక్ చేస్తూ భక్తులతో టీటీడీ చెలగాటం ఆడుతోందని మండిపడ్డాడు. కాగా సదరు భక్తుడి ఆవేదన విన్న ప్రతి పౌరుడు టీటీడీ అరాచకాలను ఖండిస్తున్నారు. తాజాగా నడకదారిలో వెళ్లే భక్తులకు చేతికర్ర ఇవ్వాలన్న టీటీడీ తీరును కూడా అందరూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.