Tirumala: తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన పురందరేశ్వరి
ABN , First Publish Date - 2023-11-01T10:06:30+05:30 IST
చిత్తూరు జిల్లా: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి బుధవారం తిరుపతిలో పర్యటిస్తున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
చిత్తూరు జిల్లా: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandeswari) బుధవారం తిరుపతిలో పర్యటిస్తున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను (Development programs) పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా, కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని, అందుకే ఏపీలో కేంద్ర ప్రభుత్వం (Central Govt.) చేస్తున్న అభివృద్ధిని వివరించే కార్యక్రమాన్ని తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పారు. రూ. 1800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వేస్టేషన్ నిర్మాణం రూ. 311 కోట్ల రూపాయలతో జరుగుతోందని, రోజుకు 85 వేల మంది ఈ రైల్వే స్టేషన్‌ను వినియోగించుకుంటున్నారని, ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరబోతోందని ఆమె పేర్కొన్నారు.
ఐఐటి, ఐజర్ లాంటి విద్యాసంస్థల్లో ఒక్కో విద్య సంస్థకు 600 నుంచి 800 కోట్ల రూపాయలు అందించామని పురందేశ్వరి తెలిపారు. మెరుగైన ప్రమాణాలతో విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని, స్మార్ట్ సిటీగా తిరుపతిని మార్చేందుకు రూ. 1695 కోట్లను కేటాయించి 87 అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. తిరుపతిలో 21 వేల తాగునీటి కనెక్షన్లు కేంద్రం ఇచ్చిందని, మురుగునీరు కాలువల నిర్మాణానికి సహకారం అందించామని, తిరుపతిలో ఒక్కో పార్కుకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చామని ఆమె చెప్పారు. శ్రీ కాళహస్తిలో కూడా కేంద్ర నిధులతో పనులు జరుగుతున్నాయని, అభివృద్ధిలో ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడవ స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని, అన్ని రాష్ట్రాల అభివృద్ధితోనే భారతదేశం అభివృద్ధిలో మూడవ స్థానంలోకి రాగలదని పురందేశ్వరి అన్నారు.