పాదయాత్రకు ముందు Selfie with Lokesh..
ABN , First Publish Date - 2023-01-30T08:46:31+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. నేడు ఆయన చెల్దిగానిపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
కుప్పం : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. నేడు ఆయన చెల్దిగానిపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన ‘సెల్ఫీ విత్ లోకేష్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంతో ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నారా లోకేష్ తన పాదయాత్రలో భాగంగా జగన్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు.
‘యువగళం’ పాదయాత్రలో భాగంగా మూడోరోజు ఆదివారం శాంతిపురం, రామకుప్పం మండలాల్లో నారా లోకేష్ పర్యటించారు. శాంతిపురంలో మహిళలతో, ఆ మండలంలోని గుండిశెట్టిపల్లెలో పాడిరైతులతో, చెల్దిగానిపల్లెలో సెరికల్చర్, హార్టికల్చర్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లడగడానికి వస్తానని చెప్పి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతావు జగన్? రైతులకు అందించే సబ్సిడీలన్నీ ఎత్తేశారు. ఆక్వా రైతులకు ఇచ్చినట్లే.. పౌల్ర్టీ రైతులకు కూడా తక్కువ రేటుకే విద్యుత్ ఇవ్వాలి. దీనిపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి సీఎం జగన్ రైతుల మెడకు ఉరితాడు వేస్తున్నాడు. మోటర్లకు మీటర్లు బిగిస్తే పీకిపారేయాలి. పన్నులు విపరీతంగా పెంచేసి అమ్మఒడి ఇస్తున్నారు’’ అని విమర్శించారు.
రకరకాల సాకులతో అమ్మఒడి డబ్బులు కట్ చేస్తున్నారని మహిళలు నారా లోకేష్ వద్ద వాపోయారు. విషం కంటే ప్రమాదకరమైన మద్యాన్ని జగన్ తయారు చేస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. ‘45ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు. టీడీపీ అధికారంలోకి వస్తే పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసరాల ధరలు తగ్గించడానికి ప్రణాళికలు తయారుచేస్తాం’ అని హామీ ఇచ్చారు.
కర్ణాటక పెట్రోల్ బంకు బ్యానర్ చూసి..
జేకేపురం జంక్షన్‌లో కర్ణాటక పెట్రోల్ బంకు వద్ద ఏర్పాటుచేసిన బ్యానర్‌ను చూసి లోకేశ్ ఆగిపోయారు. ఆ రాష్ట్రంలో డీజిల్ రూ.88అని, పెట్రోల్ రూ.102అని అందులో ఉంది. ఏపీలో డీజిల్, పెట్రోల్ ధరలు రూ.99.27, రూ.111.50గా ఉండడంతో జగన్‌రెడ్డి బాదుడు రూ.10 అంటూ ఎద్దేవా చేశారు. పెట్రో బాదుడులో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ‘కర్ణాటకలో క్వార్టర్ బాటిల్ రూ.100 తక్కువంట! సరిహద్దు ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం.. మందుబాబులు క్వార్టర్ కోసం కర్ణాటక వెళ్తున్నారు’ అని తెలిపారు.