Tirumala : తిరుమలలో పెను మార్పులు.. వెళ్లేవారు తెలుసుకుని తీరాల్సిందే..
ABN , First Publish Date - 2023-04-14T07:12:36+05:30 IST
తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నిన్నటి వరకూ కాలిబాట, గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.
తిరుపతి : తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నిన్నటి వరకూ కాలిబాట, గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ రోజు నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శనం టోకెన్ తీసుకున్నవారు.. అలిపిరి నుంచి నడిచి వెళ్లి గాలిగోపురం వద్ద తనిఖీ కేంద్రంలో ముద్ర వేసుకుంటేనే దర్శనానికి అనుమతి లభిస్తుంది.
రోజుకి టీటీడీ 8000 టోకెన్లను జారీ చేయనుంది. ఒకరోజు కోటా పూర్తి అయితే.. మరుసటి రోజు టోకెన్లను కూడా జారీకి తాత్కాలిక ఆదేశం ఇచ్చింది. భక్తులతో భూదేవి కాంప్లెక్స్ కిక్కిరిసింది. శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం యథావిధంగా దివ్యదర్శనం టోకెన్లను జారీ విధానం అమలు కానుంది. ఉచిత దర్శనం టోకెన్లను బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసము, రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజస్వామి సత్రాలులో మాత్రమే జారీ చేయనున్నారు. అలిపిరి వద్ద ఉచిత దర్శనం టోకెన్లు ఇవ్వకపోవడంతో టూరిస్ట్ బస్సుల్లో తిరుపతికి వచ్చిన భక్తులు అవస్థలు పడుతున్నారు. అలిపిరి వద్ద ఉచిత టోకెన్లు కూడా ఇవ్వాలని భక్తుల వేడుకుంటున్నారు.