TDP: రంగన్నగూడెం ఘర్షణపై పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-08-24T16:06:23+05:30 IST

రంగన్నగూడెం ఘర్షణపై తెలుగుదేశం నేతలు వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

TDP: రంగన్నగూడెం ఘర్షణపై పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

అమరావతి: రంగన్నగూడెం ఘర్షణపై తెలుగుదేశం నేతలు వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వంశీలు హింసను ప్రేరేపించేలా దాడికి ఉసిగొల్పారని ఫిర్యాదు చేశారు. పాదయాత్రపై హత్యాయత్నం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువగళం పాదయాత్రపై దాడి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర జరిగిందని తెలిపారు. పాదయాత్ర వచ్చే మార్గంలో కర్రలు, రాళ్లతో అక్రమంగా వైసీపీ శ్రేణులు గుమ్మిగూడి హింసను ప్రేరేపించడం దుర్మార్గపు చర్య అన్నారు. 20 మంది వైసీపీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొన్న వారిపై రెచ్చగొట్టే నినాదాలు చేశారని తెలిపారు. వైసీపీ గ్రామ అధ్యక్షులు తలారి ఏలియా, చిన్నా, కసుకుర్తి శ్రీనివాస్‌లు పాదయాత్రలో పాల్గొన్న మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. పాదయాత్రకు భద్రత కల్పిస్తున్న పోలీసు అధికారులపై భౌతికంగా దాడి చేసి గాయపరిచారంటూ పోలీసులకు టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు చేశారు.


అసలేం జరిగిందంటే..

బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో కొద్దిసేపు హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నారా లోకేష్ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. బ్యానర్‌పై వైసీపీ హయంలో రెండు కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందుపరిచారు. వైసీపీ నాయకులతో ఫోటో వేయడాన్ని టీడీపీ శ్రేణులు తప్పు పట్టాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఫొటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర రంగన్న గూడెంకు రాగానే బ్యానర్ వద్ద నిలబడి టీడీపీ నేతలను వైసీపీ శ్రేణులు కవ్వించాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు తోపులాట, వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు తిరగబడటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు సైతం వైసీపీ కవ్వింపు చర్యలన్ని నియంత్రించలేదు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీని తొలగించాలంటూ పోలీసులతో దేవినేని ఉమ వాగ్వాదానికి దిగారు. వైసీపీ శ్రేణులకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ మండిపడింది. వైసీపీ నేతల భద్రత కోసం భారీగా పోలీసుల్ని మోహరించారంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. చివరకు ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2023-08-24T16:06:23+05:30 IST