Ramakrishna: పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు మీకు పట్టవా?
ABN , First Publish Date - 2023-07-29T11:04:04+05:30 IST
పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అంటూ సీపీఐ రాష్ట్ర కారదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: పోలవరం విలీన మండలాల ప్రజల కష్టాలు జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రభుత్వానికి పట్టవా అంటూ సీపీఐ రాష్ట్ర కారదర్శి కె.రామకృష్ణ (CPI Leader Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం విలీన మండలాల ప్రజల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా మారిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏటపాక, చింతూరు, వర రామచంద్రపురం, కూనవరం మండలాలు ఏపీలో విలీనమయ్యాయని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు ప్రతి ఏటా గోదావరి వరద బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ఏడాది 70 అడుగుల మేర గోదావరి వరదలు వచ్చినప్పుడు జగన్ సర్కార్ కనీస చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు పునరావాసం, సహాయక చర్యలు చేపడుతుంటే ఏపీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. పోలవరం విలీన మండలాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని వైసీపీ ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండ్ చేశారు.