Gannavaram: పక్కా ప్రణాళికతోనే గన్నవరంలో వైసీపీ విధ్వంసం
ABN , First Publish Date - 2023-02-20T21:40:50+05:30 IST
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ (YCP) రౌడీ మూకలు రెచ్చిపోయాయి. గన్నవరం (Gannavaram) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసానికి తెగబడ్డాయి.
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ (YCP) రౌడీ మూకలు రెచ్చిపోయాయి. గన్నవరం (Gannavaram) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసానికి తెగబడ్డాయి. పక్కా వ్యూహంతో టీడీపీ బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ప్రణాళిక వేశారు. అదే సమయంలో టీడీపీ (TDP) శ్రేణులను భయబ్రాంతులకు గురి చేసేందుకు టీడీపీ నియోజకవర్గ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, టీడీపీ నాయకుల కార్లను దహనం చేశారు. ఈ మొత్తం విధ్వంసం టీడీపీ టికెట్‌పై గెలిచి వైసీపీ పంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) నేతృత్వంలో సాగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన ప్రధాన అనుచరులు ఓలుపల్లి మోహనరంగా, భీమవరపు యేతేంద్ర రామకృష్ణ, ముల్ఫూరి ప్రభుకాంత్ స్వయంగా కర్రలు పట్టుకుని విధ్వంసం సాగించారని తెలిపారు. కళ్ల ఎదుటే వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వచ్చాయి.
సోమవారం ఉదయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ బీసీ నాయకుడు దొంతు చిన్నకు వంశీ అనుచరుడు ఒకరు ఫోన్ చేసి బెదిరించారు. ‘వంశీని విమర్శించే స్థాయి ఉందా నీకు..? నీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు. ఆ తర్వాత కూడా పలువురు వంశీ అనుచరులమంటూ ఫోన్ చేసి బూతులు తిట్టారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే వంశీ అనుచరులు సుమారు 10 మంది మారణాయుధాలతో చిన్న ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో చిన్న ఇంటి వద్ద లేకపోవడంతో ఆయన భార్య రాణితో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వంశీ గురించి మాట్లాడితే నీ భర్త అంతు చూస్తామంటూ బెదిరించారు. దీంతో ఆందోళనకు గురైన చిన్న భార్య రాణి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గన్నవరం పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఆమెతోపాటు పలువురు టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ (Police station)కు చేరుకున్నారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు (Bachula Arjunudu) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో గన్నవరం టీడీపీ శ్రేణులకు అండగా నిలిచేందుకు టీడీపీ రాష్ట్ర నాయకుడు పట్టాభి గన్నవరం వెళ్లారు.
సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన నేరుగా విజయవాడ నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో వంశీ అనుచరులు ఓలుపల్లి మోహనరంగా అలియాస్ రంగా, భీమవరపు యేతేంద్ర రామకృష్ణ అలియాస్ రాము, ముల్ఫూరి ప్రభుకాంత్, రౌడీ షీటర్ యూసుబ్, కొల్లి చిట్టిబాబు, సగ్గుర్తి నాగదీపు, కోటి తదితరులు టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై రాడ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు కార్యాలయ ఆవరణలో ఉన్న టీడీపీ నాయకుల కార్లను పెట్రోలు పోసి తగులబెట్టారు. సుమారు 5 కార్లపై పెట్రోలు పోసి తగులబెట్టగా ఎనికేపాడుకు చెందిన టీడీపీ నాయకుడు కోనేరు పెదబాబు కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మరో నాలుగు కార్ల అద్దాలను పగులగొట్టారు. సుమారు గంటపాటు వంశీ అనుచరుల విధ్వంసం కొనసాగింది.
పక్కా ప్రణాళికతోనే..
టీడీపీ బీసీ నాయకుడిపై దాడితోపాటు పార్టీ కార్యాలయంపై దాడికి స్థానిక ఎమ్మెల్యే వంశీ అనుచరులు పక్కా వ్యూహరచన చేశారు. నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ సోమవారం ఉదయమే గన్నవరం వంశీ కార్యాలయం నుంచి మెస్సేజ్‌లు వెళ్లాయి. మధ్యాహ్నం 3 గంటలకు వంశీ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందని, ఆ తర్వాత విలేకరుల సమావేశం ఉందని అందరూ తప్పకుండా రావాల్సిందిగ ఆ మెస్సేజ్‌ల్లో కోరారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 100 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటలకు వంశీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో విధ్వంసం ప్రారంభమైంది. ఆ తర్వాత గంటకు దాడి సీన్ జాతీయరహదారిపైకి మారింది. జాతీయరహదారిపై సుమారు 3 గంటలపాటు వైసీపీ మూకలు రెచ్చిపోయాయి.