Devineni Uma : చంద్రబాబు కట్టిన భవనాల్లో కూర్చొని.. ఆయన్నే జైల్లో పెట్టారు
ABN , First Publish Date - 2023-10-26T13:20:11+05:30 IST
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఇంటింటికి తిరుగుతూ ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబుతో నేను’ కరపత్రాలను మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ, జనసేన నేతలు పంపిణీ చేస్తున్నారు.
విజయవాడ : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఇంటింటికి తిరుగుతూ ‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబుతో నేను’ కరపత్రాలను మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ, జనసేన నేతలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. రాక్షస ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ఉమ్మడి ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ, జనసేన జనంలోకి వెళుతున్నాయన్నారు. రాబోయే పదేళ్లు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పెట్టుబడిదారులు ముందుకొస్తారని ఉమ తెలిపారు.
సంపద సృష్టించాలంటే పదిమందికి పథకాలు పంచాలని దేవినేని ఉమ పేర్కొన్నారు. అప్పుచేసి పప్పుకూడు తినటం ఎందుకని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే పక్క రాష్ట్రాలకు వెళ్లి పనిచేసుకోవాల్సి వచ్చిందని సామాన్యులు చెబుతున్నారన్నారు. అమరావతి ఉంటే ఇక్కడే పని ఉండేదని.. అమరావతిలో 3 ఇటుకలు పెట్టలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కట్టిన భవనాల్లో కూర్చుని ఆయన జైల్లో పెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టానని నమ్మించి సంపద మొత్తం దోచుకుని విశాఖలో భూములను అమ్ముకునేందుకు వెళ్లిపోతున్నాడని దేవినేని ఉమ విమర్శించారు.