Dhulipalla: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2023-09-14T18:39:01+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (skill development case) విషయంలో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (skill development case) విషయంలో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు పేరు చెప్పాల్సిందిగా స్కిల్ కేసులో నిందితులను విజయసాయిరెడ్డి ప్రభావితం చేసే ప్రయత్నం చేశారంటూ ధూళిపాళ్ల ఆరోపణలు చేశారు. సీఐడీ చీఫ్ సంజయ్ ఎస్వీ రంగారావును మించి నటిస్తున్నారని ధూళిపాళ్ల విమర్శించారు.
"స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోని నిందితుల్లో కొందరిని విజయ సాయి రెడ్డి ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారు. పుణే వెళ్లి మరీ కొందరు నిందితులను విజయసాయి కలిశారు. చంద్రబాబు పేరు చెబితే రూ. 25 కోట్లు ఇస్తామని.. వారిని విజయ సాయి రెడ్డి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. సీఐడీ చీఫ్ సంజయ్ హైదరాబాద్ వెళ్లి లేక్ వ్యూలో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంది..?. బావ కళ్లల్లో ఆనందం చూడడానికి అన్నట్టు సంజయ్ తీరు ఉంది. సీఐడీ చీఫ్ సంజయ్ వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు కోసం మేము సైతం అని నిలబడ్డారు. దాని కోసమే హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. సంజయ్ ఎస్వీ రంగారావుని మించిపోయిన స్థాయిలో నటిస్తున్నారు. జీవో నెంబర్-4లో ఉన్న అంశాలను సంజయ్ నాలుగు కళ్లతో చూడాలి. గుజరాత్ పర్యటించి అధ్యయనం చేశాకే సీమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. డబ్బులు ఏ విధంగా ఇవ్వాలనే అంశంపైనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రేమ్ చంద్రారెడ్డి సూచనల మేరకు.. ఆయన సంతకం పేరుతోనే నిధులు విడుదలయ్యాయి." అని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.
"సీమెన్స్ ప్రాజెక్టును సెంట్రల్ టూల్ డిజైన్ సంస్థ ద్వారా వాల్యూయేషన్ చేయించారు. ఆ తర్వాతే నిధుల విడుదల జరిగింది. సెక్రటరీగా అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు. గుజరాత్ కంటే ఎక్కువగా ఏపీలో స్కిల్ సెంటర్లు పెట్టాలని ఐఏఎస్ సునీత రాశారు. పీవీ రమేష్ ఏదో చెప్పారని సీఐడీ చెప్పింది...కానీ తాను అలా చెప్పలేదని అదే పీవీ రమేష్ స్పష్టం చేశారు. సీమెన్స్ వ్యవహరం అంతా సెలెక్టివ్ హెరాస్మెంటే. చంద్రబాబు మీద బురద జల్లేందుకే ప్రాజెక్టుతో సంబంధం లేని కొన్ని కంపెనీలతో లింక్ పెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలను కూడా షెల్ కంపెనీలు అంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ఖాతాలకు వచ్చాయోననేది సీఐడీ చీఫ్ చెప్పలేకపోతున్నారు. డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి వంటి వారికి ఎంపీ టిక్కెట్ ఇస్తామంంటున్నారట. ఈ కేసులో ఎవరైతే తప్పుడు విధానంలో వ్యవహరిస్తారో.. వారిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టం. ఈడీ దర్యాప్తులో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావన లేదే..?. సీమెన్స్ గ్లోబల్, సీమెన్స్ ఇండియా సంస్థలకు మొత్తం రూ. 70 కోట్లు వెళ్లాయి. డబ్బులు తీసుకున్న సంస్థలు తమకు ఆ ప్రాజెక్టుతో సంబంధం లేదంటే కుదురుతుందా..?. సీమెన్స్ ఇండియా సంస్థ ప్రతినిధులను బెదిరించి సీఐడీ లేఖ తీసుకుని ఉండొచ్చు." అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.