AP NEWS: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయ ఉద్యోగులపై పోలీసుల కేసు నమోదు
ABN , First Publish Date - 2023-10-31T11:18:18+05:30 IST
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం ( Dvarakathirumala Venkanna Temple )లో పనిచేస్తున్న ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏలూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం ( Dvarakathirumala Venkanna Temple )లో పనిచేస్తున్న ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవస్థానం ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఈ భాస్కర్, డీఈఎన్ఎస్ రాజు, అలాగే ఆలయ ఏఈవో నటరాజ్‌తో పాటు పలువురు దేవస్థాన సిబ్బందిపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 23వ తేదీన చిన వెంకన్నకు సంబంధించిన ఉప ఆలయమైన శ్రీ కుంకులమ్మ ఆలయంలో దసరా సందర్భంగా అమ్మవారి రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవంలో జరుగుతున్న సమయంలో రథం చెరువు వీధికి చేరుకుంది.. అక్కడ ఓ ఇంటి ముందు పార్క్ చేస్తున్న కారుని రథ చక్రాలు ఢీకొట్టడంతో కారు పాక్షికంగా ధ్వంసం అయింది. అయితే ఆలయ అధికారులు తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, అంతేకాకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తన కారుని ధ్వంసం చేశారని, అయితే కారు ధ్వంసం ఘటనపై ఆలయ అధికారులను వివరణ కోరగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితుడు కారు యజమాని రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రమేష్ ఫిర్యాదుతో ద్వారకాతిరుమల పోలీసులు దేవస్థానం అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.