Share News

East Godavari Dist.: దొమ్మేరులో మీడియాపై పోలీసుల కఠిన ఆంక్షలు

ABN , First Publish Date - 2023-11-16T11:08:35+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా: కొవ్వూరు మండలం, దొమ్మేరులో పోలీసులు మీడియాపై కఠిన ఆంక్షలు విధించారు. ఆ గ్రామంలోకి మీడియాను అనుమతించలేదు. మృతుడు మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళితులు ఆందోళన చేపట్టారు.

East Godavari Dist.: దొమ్మేరులో మీడియాపై పోలీసుల కఠిన ఆంక్షలు

తూర్పుగోదావరి జిల్లా: కొవ్వూరు మండలం, దొమ్మేరులో పోలీసులు మీడియాపై కఠిన ఆంక్షలు విధించారు. ఆ గ్రామంలోకి మీడియాను అనుమతించలేదు. మృతుడు మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళితులు ఆందోళన చేపట్టారు. దళిత యువకుడు మహేంద్ర మృతికి కారణమైన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. దొమ్మేరులో దళిత యువకుడు మహేంద్ర ఆత్మహత్యకు హోంమంత్రి తానేటి వనిత నైతిక బాధ్యత వహించి స్వచ్చంధంగా అరెస్టు కావాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహేంద్ర వాంగ్మూలాన్ని సుమోటోగా తీసుకుని హోంమంత్రిఫై కేసు నమోదు చేయాలని జవహర్ అన్నారు.

పూర్తి వివరాలు...

హోంమంత్రి తానేటి వనిత ఇలాకాలో వైసీపీ ఫ్లెక్సీ వివాదం దళిత యువకుడిని బలి తీసుకుంది. ఫ్లెక్సీ చించేశారని వైసీపీ నేతల ఫిర్యాదుతో పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో ఆ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దళిత యువకులు, స్థానికులు మృతదేహంతో ధర్నాకు దిగి.. గ్రామంలోకి పోలీసులను రానివ్వకుండా కుర్చీలు, రాళ్లతో దాడి చేశారు. బుధవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఈ ఘటన జరిగింది. హోం మంత్రి వనిత కాన్వాయ్‌పైనా దాడి చేసి రెండు కార్ల అద్దాలను పగలగొట్టారు. వైసీపీలోని వర్గ విభేదాలే యువకుడి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. దొమ్మేరులో 6వ తేదీ నుంచి వనిత ‘గడప గడప’కు చేపట్టారు. ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో మంత్రికి స్వాగతం పలుకుతూ వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టారు. ఆ ఫ్లెక్సీల్లో ఉన్న గ్రామ వైసీపీ నాయకులు ముదునూరి నాగరాజు, బొల్లిన సతీశ్‌ల ఫొటోలపై అదేరోజు రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తలలు కట్‌ చేశారు. దీనిపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్‌ఐ భూషణం కొవ్వూరు వైసీపీ జడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి బావ కుమారుడు బొంతా మహేంద్ర (21)ను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

జడ్పీటీసి భర్త పోసిబాబు ఈ విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. పోలీసులు సుమారు ఏడుగంటల పాటు నిర్బంధంలో ఉంచారు. స్థానిక నాయకులు స్టేషన్‌కు వెళ్లినా పోలీసులు మహేంద్రను వారి వెంట పంపించలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో విడిచిపెట్టారు. ఇంటికి వచ్చిన యువకుడు మంగళవారం తెల్లవారుజామున కలుపుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం చాగల్లు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పోలీసులు మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి, రాత్రి విజయవాడ తరలిస్తుండగా ఏలూరు సమీపంలో మహేంద్ర మృతి చెందాడు. పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారనే మనస్తాపంతో మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహేంద్ర ఆత్మహత్యకు ఫ్లెక్సీ వివాదమే కారణమని, గ్రామంలో నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలూ దీనికి ఆజ్యం పోశాయని గ్రామస్తుల నుంచి వినిపిస్తోంది. మృతుడు కూడా వైసీపీ సానుభూతిపరుడే.

Updated Date - 2023-11-16T11:08:37+05:30 IST