Prattipati Pullarao: మూడు మర్డర్లు.. ఆరు నేరాలతో పరిఢవిల్లుతున్న ఏపీ
ABN , First Publish Date - 2023-06-17T10:59:38+05:30 IST
బాపట్లలో 15ఏళ్ల బాలుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటనపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. పొద్దున్నే కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవదహనాలు జరుగుతున్నాయని తెలిపారు.
పల్నాడు: బాపట్లలో 15ఏళ్ల బాలుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటనపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (TDP Leader Prattipati Pullarao) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. పొద్దున్నే కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవదహనాలు జరుగుతున్నాయని తెలిపారు. మూడు మర్డర్లూ.. ఆరు నేరాలతో రాష్ట్రం పరిఢవిల్లుతోందని యెద్దేవా చేశారు. బాపట్లలో 15 ఏళ్ల పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలుబెట్టడం అత్యంత దారుణమన్నారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వ ప్రచారమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని నేరాలు జరుగుతున్నా.. క్రైమ్ తగ్గిందని డీజీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా మార్చారని విమర్శించారు. ప్రజా భద్రతను వదిలేసి టీడీపీ శ్రేణులను వేధించడంపైనే పోలీసులు దృష్టి పెట్టారని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాగా.. బాపట్లలో విద్యార్థి అమర్నాథ్ పాము వెంకటేశ్వర రెడ్డి, మరో ముగ్గురు యువకులు కలిసి నిన్న దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విద్యార్థి హాహాకారాలతో స్థానికులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పి వేసి విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన విద్యార్థి మృతి చెందాడు. తన అక్కను వేధించడంపై ప్రశ్నించినందుకు అమర్నాథ్‌ను నిందితులు ఇంత దారుణంగా హత్య చేశారు. తనను ప్రశ్నించడంపై ఆగ్రహంతో స్నేహితులతో కలసి పాము వెంకటేశ్వర రెడ్డి... అమర్నాథ్‌ను పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్నబిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు.