Chintamohan: చంద్రబాబు అరెస్ట్‌లో రాజకీయ కక్ష
ABN , First Publish Date - 2023-10-20T12:34:27+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) అరెస్టులో రాజకీయ కక్ష ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ (Former Union Minister Chintamohan) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అమాయకుడని.. ఆయన ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నాని..ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమైన చర్య అని చెప్పుకొచ్చారు. న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వాసం తగ్గుతోందన్నారు. చంద్రబాబు కేసులో రుజువులు ఎక్కడ ఉన్నాయి.. చూపించండి అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ ఢిల్లీ పెద్దల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు అరెస్టుపై ప్రజాస్వామ్యవాదులు నోరు విప్పాలన్నారు. న్యాయస్థానాలపై నమ్మకం కోల్పోతున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలన్నారు. న్యాయస్థానాల్లో రాజకీయ ప్రమేయంపై సుప్రీంకోర్టు సీజే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మార్గదర్సిపై కక్ష సాధింపు ఎందుకని అన్నారు. వయస్సుపైబడిన రామోజీరావుపై అక్రమ కేసులెందుకని నిలదీశారు. పాత పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలన్నారు. ఇండియన్ పొలిటికల్ సర్వీసా.. ఇండియన్ పోలీస్ సర్వీసా...అని ప్రశ్నించారు. పాలస్తీనాలోని గజి ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో 500 మంది మరణించడం బాధాకరమన్నారు. బాంబు దాడులకు కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను నరేంద్రమోడీ పొగడటం దారుణమన్నారు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు.