Odisha train accident: ఏపీకి చెందిన 80 మంది సేఫ్

ABN , First Publish Date - 2023-06-03T17:24:53+05:30 IST

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 80 మంది ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు

Odisha train accident: ఏపీకి చెందిన 80 మంది సేఫ్
Odisha train accident

అమరావతి: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 80 మంది ప్రయాణికులు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆరుగురికి స్వల్ప గాయాలు అయినట్లు వెల్లడించారు. మరో 22 మంది ప్రయాణం చేయలేదని అధికారులు తేల్చారు. మొత్తం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన వారు 137 మంది ప్రయాణం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. నాలుగు నెంబర్లు పనిచేయడం లేదని.. ఇంకో 11 ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయని.. మరో 9 ఫోన్లు అందుబాటులోకి రాలేదని అధికారులు తెలిపారు. ఇక యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం ఏపీకి చెందిన 41 మంది ప్రయాణం చేసినట్లు గుర్తించారు. ఇందులో 21 మంది సేఫ్‌గానే ఉన్నట్లు పేర్కొన్నారు. మరో ముగ్గురు టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఇంకో 8 మంది ఫోన్లు రెస్పాండ్ కావట్లేదని.. మరో రెండు స్విచ్‌ ఆఫ్‌ అయ్యాయని తెలిపారు. రెండు నెంబర్లు మాత్రం రాంగ్ నెంబర్లుగా తేల్చారు.

ప్రస్తుతం ఒడిశా రైలు ప్రమాదంలో (Odisha train accident) మృతుల సంఖ్య 261కు చేరింది. రైలు ప్రమాదంలో మరో 900 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, గూడ్స్‌ రైలు ఢీకొని ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాలాసోర్‌ జిల్లా బహనాడ రైల్వే స్టేషన్‌ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 30 సెకండ్ల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదస్థలిని ప్రధాని మోదీ సందర్శించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఇంకోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-06-03T17:45:23+05:30 IST