AP High Court : వలంటీర్ వ్యవస్థపై ఏపీ హైకోర్టు సీరియస్.. అంత నమ్మకం లేదా అంటూ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2023-02-28T20:29:37+05:30 IST

వాలంటీర్ల వ్యవస్థ (volunteers system)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది

  AP High Court : వలంటీర్ వ్యవస్థపై ఏపీ హైకోర్టు సీరియస్.. అంత నమ్మకం లేదా అంటూ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం

అమరావతి: వలంటీర్ల వ్యవస్థ (volunteers system)పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వలంటీర్లను పెట్టారా అని హైకోర్టు ప్రశ్నించింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు? అని న్యాయస్థానం మండిపడింది. గతంలో లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా?, రాజకీయ కారణాలతో తమను జాబితా నుంచి తొలగించారని, గారపాడుకు చెందిన 26 మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు వలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు మేం వ్యతిరేకం కాదని, వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్దమైనదని హైకోర్టు పేర్కొంది. వాలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని, చట్టం అనుమతిస్తే వాలంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కోర్టు తెలిపింది. శాశ్వత ఉద్యోగులుగా నియమించి సర్వీస్ రూల్స్ రూపొందించండి అని కోర్టు వెల్లడించింది. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సెర్ప్‌ సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌కు జస్టిస్ భట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు తదుపరి విచారణ మార్చి 10కి వాయిదా చేసింది.

వచ్చే ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. సీఎం జగన్‌ తన మానస పుత్రిక వలంటీరు వ్యవస్థ తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. పార్టీ శ్రేణుల కంటే వలంటీరు వ్యవస్థనే ఎక్కువగా నమ్ముతున్నారు. రాష్ట్రస్థాయిలో వ్యూహకర్తల బృందం ఉండగా.. క్షేత్రస్థాయిలో వలంటీర్లు పనిచేస్తేనే గెలుపు సాధ్యమన్న భావనతో ఉన్నారు. అందుకే వలంటీర్లపై గృహసారథులు, సచివాలయ కన్వీనర్లను నియమిస్తున్నారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా వలంటీర్లతో సమావేశమై వచ్చే ఎన్నికల కోసం దిశ నిర్దేశం చేస్తున్నారు. అయితే వలంటీర్లు ప్రభుత్వ సేవకులుగా ఉన్నారు. గృహ సారథులుగా నియమితులైన వారు మాత్రం పార్టీ మనుషులు. వలంటీర్లు వైసీపీ సానుభూతిపరులు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ గృహసారథులను పార్టీ మనుషులను నియమించి.. పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను అప్పగించారు. 50 కుటుంబాలకు ఇద్దరు చొప్పున నియమించనున్నారు. వీరు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరాతీస్తారు. ఎక్కడైనా వైఫల్యముంటే దానిని సరిదిద్దుతారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ పార్టీ మనుషులుగా వీరు సమస్యకు ఎలా పరిష్కార మార్గం చూపిస్తారు అన్నదే ఇప్పుడు ప్రశ్న. అటు వలంటీర్లు, ఇటు సచివాలయ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేస్తారన్న మాట. అయితే ఈ పనిచేసే క్రమంలో నేరుగా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి చేస్తారన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే పెత్తనం చేస్తారన్న ప్రచారం ఉంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించారు. పంచాయతీకి 10 మందికి తగ్గకుండా నియమించారు. వారికి కేటాయించిన 50 కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించడం వీరి ప్రధాన విధి. వీరికి నెలకు రూ.5 వేలు చొప్పున వేతనం కూడా ప్రకటించారు. అయితే మిగతా ప్రజాప్రతినిధుల కంటే వలంటీర్లకే ప్రజల్లో పట్టు పెరిగింది. వారి మాటే చెల్లుబాటు అవుతోంది. ప్రజలు ఏ చిన్నపనికైనా వారినే సంప్రదిస్తున్నారు. ఇది పదవుల్లో ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మింగుడుపడడం లేదు. ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు సైతం వలంటీరు వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అటు ప్రభుత్వం నిర్దేశించిన గడపగడకూ కార్యక్రమంలో వలంటీరు లేనిదే అడుగు తీయలేని పరిస్థితి ప్రజాప్రతినిధులకు దాపురించింది. చివరకు పథకాలు ఇస్తోంది ఎవరు? అని ప్రశ్నించినప్పుడు వలంటీర్లే కదా అని బదులిచ్చేదాక పరిస్థితి వచ్చింది. దీనిపైనే అధిష్ఠానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాని ఫలితమే ప్రజాప్రతినిధులతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ

చాలా గ్రామాల్లో వలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు వలంటీర్లు స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీలకు లెక్క చేయడం లేదు. మరికొందరు తమకు నచ్చిన రీతిలో పనిచేస్తున్నారు. అటువంటి చోట జఠిలంగా మారింది. ఈ నేపథ్యంలో వలంటీర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వలంటీర్లపై నియంత్రణ అవసరమని ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి నివేదించారు. అటు ఎమ్మెల్యేలు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరోవైపు కొన్ని పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడెంచల విధానాన్ని అనుసరిస్తున్నాయి. అవి ఎన్నికల్లో విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో దానినే అనుసరిస్తూ వైసీపీ కూడా మూడెంచల విధానాన్ని ప్రవేశపెట్టనుంది. వలంటీర్లు, గృహసారథులు, ఆపై కన్వీనర్లతో ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేలవం తమ ప్రభుత్వం నియమించిందన్న కారణం చూపి ఇప్పటికే సచివాలయ ఉద్యోగులపై రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. వలంటీర్లు సైతం పెత్తనం చేస్తున్న సందర్భాలు అధికం. ఇప్పుడు కొత్తగా గృహసారథులు, కన్వీనర్లు రానుండడంతో మరింత ఒత్తిడిపెరిగే చాన్స్‌ ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో గ్రామస్థాయిలో అధికార పార్టీలో వర్గ విభేదాలు కూడా ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి

మేము జగన్‌పై ఉద్యమానికి వెళ్తున్నాం

జగన్‌తో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా?: సోమిరెడ్డి

ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు

Updated Date - 2023-02-28T21:24:29+05:30 IST