MP Avinash Reddy: అన్ని కోణాల్లో అవినాశ్ ‘పాత్ర’!
ABN , First Publish Date - 2023-07-25T02:13:12+05:30 IST
వివేకా హత్య కేసులో కీలక సాక్షి, ఫిర్యాదుదారు, ‘అనుమానితుడు’ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నుంచి జమ్మలమడుగులో జగన్ మీడియా విలేకరి వరకు అనేకుల వాంగ్మూలాలు ఇప్పుడు బయటపడ్డాయి.
కీలక వాంగ్మూలాలు, టెక్ ఆధారాలు చెబుతున్నదిదే
‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో సీబీఐ మేం చెప్పిన కోణంలో దర్యాప్తు చేయడంలేదు. ఎస్పీ రాంసింగ్ నన్నూ, మా నాన్నను ఈ కేసులో ఇరికించారు’... ఇది ఎంపీ అవినాశ్ రెడ్డి పదేపదే చేస్తున్న ఆరోపణ! దీనికి సీబీఐ చెబుతున్న సమాధానం... ‘మీరు చెప్పిన కోణంలోనే కాదు! అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశాం. వందలమందిని ప్రశ్నించాం. వాంగ్మూలాలు నమోదు చేశాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలూ సేకరించాం. ఆ తర్వాతే.... మీరే కుట్రదారులని తేల్చాం’ అని!
వివేకా హత్య కేసులో పదుల సంఖ్యలో సాక్షులు
కీలక వాంగ్మూలాలు సేకరించిన సీబీఐ
చూడగానే హత్యగా వివేకా పీఏ నిర్ధారణ
అయినా... గుండెపోటు కథలతో మాయలు
కేసు నమోదు చేయొద్దంటూ సీఐపై ఒత్తిడి
‘సీరియస్’గా ఉందంటూ డాక్టర్‌కు పిలుపు
ఆ తర్వాత ఆయనను గేటుదగ్గరే ఆపిన వైనం
‘సొంత’ కాంపౌండర్‌తో గాయాలకు బ్యాండేజీ
డ్యూటీ నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి గాయబ్
సెలవు పెట్టి అవినాశ్ ఇంట్లో మకాం
దర్యాప్తులో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం
లొకేషన్, డేటా విశ్లేషణలతో పక్కా ఆధారాలు
అయినా.. ‘తమ’ కోణంలో
దర్యాప్తు చేయలేదంటున్న ఎంపీ
(అమరావతి - ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో కీలక సాక్షి, ఫిర్యాదుదారు, ‘అనుమానితుడు’ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి(PA MV Krishna Reddy) నుంచి జమ్మలమడుగులో జగన్ మీడియా విలేకరి వరకు అనేకుల వాంగ్మూలాలు ఇప్పుడు బయటపడ్డాయి. ‘వివేకా మృతదేహం చూడగానే హత్యే అనే నిర్ధారణకు వచ్చాను’ అని ఎంవీ కృష్ణారెడ్డి సీబీఐ(cbi)కి స్పష్టంగా చెప్పారు. అయినా సరే... ‘గుండెపోటు, రక్తపువాంతులు’ అంటూ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు ప్రచారం చేశారు. పైగా... ‘హత్య కేసు నమోదు చేయండి’ అని అప్పటి సీఐ శంకరయ్య(CI Shankaraiah)ను కోరగా, అక్కర్లేదని వాదించి, వారించారని కూడా ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆ రోజు అవినాశ్ రెడ్డితోపాటు వివేకా ఇంటికి వెళ్లి మృతదేహాన్ని చూసిన ఆయన అనుచరుడు, కాంట్రాక్టర్ ప్రశాంత్ రెడ్డి(Contractor Prashanth Reddy) కూడా ఇదే చెప్పారు. ‘అది హత్యేనని 60 శాతం అనిపించింది. అయితే... ఆయన గుండెపోటుతో చనిపోయినట్లుగా అక్కడున్న వాళ్లు మాట్లాడుకోవడం వినిపించింది. అప్పుడు వివేకా నివాసంలో... వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలను కూడా చూశాను. కాంపౌండర్ జయప్రకాశ్ రెడ్డి కూడా లోపలే ఉన్నాడు. ఆ తర్వాత వివేకా మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు’’ అని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇలాంటి అనేక ఆధారాలు ఉన్నందునే ఎంపీ అవినాశ్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి(Bhaskar Reddy)ని సీబీఐ ఈ కేసులో నిందితులుగా చేర్చిందని స్పష్టమవుతోంది. ఆయా వాంగ్మూలాలను పరిశీలిస్తే... అవినాశ్ రెడ్డిపై పాత్రపై అనేక సందేహాలు తలెత్తక మానవు.
‘సీరియ్‌స’గా ఉందని చెప్పడమేమిటో!
ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే, ఆ విషయాన్ని ఉన్నదున్నట్లుగా చెబితే కుటుంబ సభ్యులు కలవరపడిపోతారని... ‘సీరియ్‌సగా ఉంది. వెంటనే బయలుదేరి రండి’ అని చెప్పడం సహజం. కానీ... వివేకా కేసులోనూ ఇలాంటి ‘సీరియస్’ డ్రామా జరిగింది. ఈసీ గంగిరెడ్డి (Gangireddy) (వైఎస్ భారతి తండ్రి) ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ మధు రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6.35 గంటలకు ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడు సతీశ్ రెడ్డి నుంచి డాక్టర్ మధుకు ఫోన్ వచ్చింది. ‘‘వివేకా అంకుల్‌కు సీరియ్‌సగా ఉంది. వెంటనే ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్లు’’ అని చెప్పారు. అక్కడికి వెళ్లడానికి తనకు వెహికల్ లేదని చెప్పడంతో... గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి (ఏ6) వచ్చి పికప్ చేసుకుంటాడని సతీశ్ రెడ్డి బదులిచ్చారు. మధు రెడ్డి చకచకా అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు తీసుకుని, క్యాజువాలిటీ నర్సుతోపాటు ఆస్పత్రి బయటికి వచ్చారు. ఉదయ్ రెడ్డి వారిద్దరినీ తన కారులో వివేకా ఇంటికి తీసుకెళ్లారు. కానీ... అక్కడ వీళ్లను వివేకా ఇంట్లోకి అనుమతించలేదు. మందులేం అక్కర్లేదన్నారు. అప్పటికే ఆర్థోపెడీషియన్ డాక్టర్ అభిషేక్ రెడ్డి లోపల ఉన్నట్లు తెలిసిందని డాక్టర్ మధు చెప్పారు. దీంతో తాను, క్యాజువాలిటీ నర్సు తిరిగి ఆస్పత్రికి వచ్చేసినట్లు సీబీఐకి వెల్లడించారు. వివేకానందరెడ్డి మరణించారని స్పష్టంగా తెలిసినా... ‘సీరియస్’ అంటూ డాక్టర్‌ను పిలిపించడమేమిటి? తీరా పిలిపించిన డాక్టర్‌ను లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించడమేమిటి? అసలు ఎందుకీ హైడ్రామా? అంటే... అప్పటికే వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా ‘కవర్’ చేసేందుకేనా? వివేకా శరీరంపైన గాయాలకు ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్న జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజీ కట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈయన కుమారుడే... ఉదయ్ కుమార్ రెడ్డి.
ఉదయ్ ఎక్కడున్నాడు?
వివేకానందరెడ్డి కేసులో ఆరో నిందితుడైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి... హత్యకు ముందు, ఆ తర్వాత ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలతో బాగా టచ్‌లో ఉన్నట్లు సీబీఐ ఇప్పటికే ‘లొకేషన్’ ద్వారా గుర్తించింది. ఉదయ్ కుమార్ రెడ్డి యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్)లో ఉద్యోగి. అందులో మెకానికల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... ఆ రోజు ఉదయం 7.51 గంటలకు ఉదయ్ ఎలకా్ట్రనిక్ పంచ్ (హాజరు నమోదు) వేశాడు. అక్కడి నుంచి వర్క్ ప్లేస్‌కు వెళ్తున్నట్లు చెప్పాడు. సాయంత్రం మళ్లీ ప్లాంటుకు వచ్చి పంచ్ వేయాలి. కానీ... వేయలేదు. ఆ మరుసటి రోజు ఉదయం 7.37 గంటలకు సూపరింటెండెంట్ ఫోన్ చేయగా... ఆ రోజు సెలవు పెట్టాడు. ఆ తర్వాత వరుసగా ఈఎల్స్, మెడికల్ లీవులు పెట్టి... 25వ తేదీన డ్యూటీలో చేరాడు. ఇక... సీబీఐ గుర్తించిన లొకేషన్ ప్రకారం... 14వ తేదీ మధ్యాహ్నం 12.29 గంటల వరకు మాత్రమే ఉదయ్ యూసీఐఎల్ వర్క్‌షా్‌పలో ఉన్నాడు. తర్వాత... ‘మాయం’! సాయంత్రం 6.53 నుంచి అవినాశ్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. ఇంకా... ఇతర నిందితులైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితోనూ టచ్‌లో ఉన్నాడు. హత్య జరిగిన తర్వాత ఉదయం 6.03 గంటలకే అవినాశ్ ఇంట్లో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నాడు! కారణం ఏమిటో!?
అవినాశ్-గంగిరెడ్డి వాట్సప్ చాటింగ్...
వివేకా హత్య జరిగిన రోజు రాత్రి వైఎస్ అవినాశ్ రెడ్డి వాట్స్‌పలో బాగా యాక్టివ్‌గా ఉన్నట్లు సీబీఐ ఇది వరకే తెలిపింది. అదే సమయంలో ఎర్ర గంగిరెడ్డి కూడా వాట్స్‌పలో ఉన్నట్లు నిర్ధారించింది. ఎంఏకే సైబర్ సెక్యూరిటికి చెందిన నిపుణుడు సయ్యద్ ముజఫర్ హుస్సేన్ ద్వారా ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్ రెడ్డి మొబైల్‌ఫోన్లలోని ‘యాక్టివిటీ’ని విశ్లేషించారు. ఆయన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ నమోదు చేసింది. ‘‘ఎర్ర గంగిరెడ్డి ఫోన్‌లో ఉన్న డేటాను రికవర్ చేసేందుకు యుఎ్‌ఫఈడీ (యూనివర్సల్ ఫోరెన్సిక్ ఎక్స్‌ట్రాక్షన్ డివైజ్)ను ఉపయోగించాం’’ అని ఆయన తెలిపారు.
సాంకేతికంగా కసరత్తు...
వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ వందలమంది సాక్షులను ప్రశ్నించడమే కాదు... గతంలో ఎన్నడూ వినని అధునాతన టెక్నాలజీని కూడా ఉపయోగించింది. గూగుల్ టేకౌట్ ద్వారా జీపీఎస్ లొకేషన్, గూగుల్ మీట్ ఇతర ఆన్‌లైన్ యాక్టివిటీని గుర్తించింది. నిందితులు ఏ సమయంలో ఎక్కడున్నారో జీపీఎస్ ద్వారా 99శాతం పక్కాగా పసిగట్టింది. వివేకాతో బలవంతంగా రాయించిన లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రిడ్ టెస్ట్‌ను పరిచయం చేసింది. దీనిని త్రివేండ్రంలోని సీ-డాక్‌కు పంపింది. వివేకా ఇంట్లోని వైఫై రౌటర్‌కు ఎవరెవరు కనెక్ట్ అయ్యారో తెలుసుకునేందుకు అమెరికా అధికారుల సహాయం కూడా కోరింది.
ఇంకేం ఆశిస్తున్నారో!?
వివేకా రెండో పెళ్లి, ఆస్తుల వివాదం నేపథ్యంలో కుమార్తె, అల్లుడే ఆయనను చంపించి ఉంటారన్నది అవినాశ్ రెడ్డి తదితరుల ఆరోపణ! ఈ కోణంలోనూ సీబీఐ లోతుగా దర్యాప్తు చేసింది. వివేకా రెండో భార్యను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పాత్రపై ఎలాంటి అనుమానాలూ లేవని, ఆధారాలు లభించలేదని సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీటులో స్పష్టం చేసింది. వివేకాతో బలవంతంగా రాయించిన లేఖను ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి దాచేశారని, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదని కూడా అవినాశ్ రెడ్డి ఆరోపించారు. అయితే... ఆ లేఖను అదే రోజున రాజశేఖర్ రెడ్డే పోలీసులకు అప్పగించారు. అన్నింటికంటే మించి... ‘హత్య కేసు నమోదు చేయవద్దు’ అని అవినాశ్ రెడ్డి తదితరులు వాదించగా... రాజశేఖర్ రెడ్డి సీఐతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని కోరినట్లు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి స్వయంగా తెలిపారు. ఇలాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకునే వివేకా కుమార్తె, అల్లుడిపై ఎలాంటి అనుమానాలు లేవని సీబీఐ తేల్చి చెప్పింది.