BJP FUNDS: కమలంలో నిధుల దుమారం
ABN , First Publish Date - 2023-08-23T02:38:44+05:30 IST
రాష్ట్ర బీజేపీలో నిధుల (AP BJP funds) దుమా రం రేగుతోంది. డబ్బు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు దారి మళ్లాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ సొమ్ము భారీగా దుర్వినియోగం
లెక్క తేలని డబ్బు రూ.15 కోట్లు!
తాడేపల్లిలో వివాదాస్పద భూమికి 3.5 కోట్లు చెల్లింపు
శ్రీకాకుళం భూ వ్యవహారంలో మరో కోటి చెల్లింపు
గుట్టుగా రికవరీ కోసం విశాఖలో బీజేపీ పాత కమిటీ నేతలతో భేటీ
20 లక్షలు చెల్లించిన బెజవాడ నేత
నేడు కొత్త కమిటీ సమావేశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీలో నిధుల (AP BJP funds) దుమా రం రేగుతోంది. డబ్బు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు దారి మళ్లాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ డబ్బు రికవరీ చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర నాయ కత్వం కసరత్తు చేస్తోంది. బుధ వారం విజయవాడ(Vijayawada)లో నూతన కార్యవర్గం సమావేశం కాబోతోంది. ఈలోపే నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. పార్టీ కార్యకలాపాల కోసం సేకరించిన నిధులు, జాతీయ నాయకత్వం పంపిన డబ్బు రూ.15కోట్ల వరకూ లెక్క తేలలేదని సమాచారం. అతి తక్కువగా విజయవాడకు చెందిన నాయకుడు రూ.20లక్షలు వాడేసుకున్నారు. అత్యధికంగా తాడేపల్లిలోని వివాదాస్పద భూమి కొనుగోలు కోసమంటూ రూ.3.5 కోట్ల పార్టీ సొమ్ము దారి మళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు మూడేళ్లుగా ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ అంతర్గతంగా లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉపఎన్నికల్లో ఖర్చులకూ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి భారీగా వసూలు చేసి అరకొరగా ఖర్చు చేసినట్లు అప్పట్లో ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి.
శ్రీకాకుళం జిల్లాలో పార్టీ కార్యాలయ స్థలం విక్రయం, మరోచోట కొనుగోలు వ్యవహారంలో కోటికి పైగా దుర్వినియోగమైనట్లు ఆ జిల్లా నేతలు గతంలోనే ఫిర్యాదు చేశారు. వీటితోపాటు రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం సీఎం జగన్ నివాసానికి దగ్గర్లో వివాదాస్పద స్థలాన్ని కొనేందుకు ఒకరికి కోట్లాది రూపాయలు అడ్వాన్సుగా చెల్లించినట్లు సమాచారం. అయితే ఆ స్థలం తమదంటూ కొందరు దళితులు ఆందోళనకు దిగారు. విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పటి రాష్ట్ర నేతలు లెక్కచేయలేదు. దీంతో బాధితులు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అప్పటి నాయకత్వానికి అధికార పార్టీతో సత్సంబంధాలు ఉండడంతో కేసు నమోదు కాలేదు. చివరకు దళిత సంఘాలు ఉద్యమించడం.. వివాదం ముదరడంతో సదరు నేతలు వెనక్కి తగ్గారు. కానీ ఆ భూమి కోసం చెల్లించిన డబ్బు రికవరీ కాలేదని ప్రచారం జరుగుతోంది.
ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసుకునేందుకు అప్పటి రాష్ట్ర పార్టీ నాయకుడొకరు విజయవాడలోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటుచేసి కొంత ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, ప్రస్తుత కమిటీలోకి తనను తీసుకోవద్దని చెప్పిట్లు సమాచారం. పార్టీ నిధులకు సంబంధించి లెక్క చెప్పాల్సి రావడంతో.. తాను నిమిత్తమాత్రుడినంటూ.. ‘పైవాళ్లు’ ఏం చేశారో చెప్పేసినట్లు తెలిసింది. ఈ వివరాలు బయటకు వస్తే బీజేపీకి అప్రతిష్ఠ అని భావించి నూతన నాయకత్వం గుట్టుగా నిధులు రికవరీ చేసేపనిలో పడింది. అందుకే పాత కమిటీ నేతలందరితో విశాఖలో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. విజయవాడలో గుజరాతీ భాష మాట్లాడే ఒక నాయకుడు 20లక్షలు వాడేసుకున్నట్లు ఫిర్యాదులందాయి. ఆ డబ్బు చెల్లించే వరకూ పార్టీకార్యక్రమాలకు రావడానికి వీల్లేదంటూ ఆయనపై నిషేధం విధించారు. ఇటీవల పురందేశ్వరిని కలిసి 20లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు. అయితే రూ.కోట్లు తినేసిన వారినుంచీ రాబట్టాలని ఆయన ఢిల్లీ పెద్దలకు విన్నవించడంతో పాత కమిటీలోని కీలక నేతల్లో కలవరం మొదలైంది. మరోవైపు.. బుధవారం విజయవాడలో కొత్త కమిటీ సమావేశం కానుంది.
భావి కార్యక్రమాలపై బీజేపీ కోర్ కమిటీ చర్చ
పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మంగళవారం విశాఖలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నివాసంలో సమావేశమై చర్చించింది. పార్టీ అగ్రనాయకులు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సోము వీర్రాజు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సత్యకుమార్, పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.