Guntur: యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో తెనాలి కోర్టు సంచలన తీర్పు
ABN , First Publish Date - 2023-06-21T13:53:48+05:30 IST
జిల్లాలోని నిజాంపట్నం మండలం అడవులదీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన కేసులో 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2016లో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుంటూరు: జిల్లాలోని నిజాంపట్నం మండలం అడవులదీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు (Telanali Court) సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన కేసులో 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2016లో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవులదీవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేపల్లెకు చెందిన షేక్ జాస్మిన్ అనే యువతి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే జాస్మిన్ మృతికి గరువు గ్రామానికి చెందిన శ్రీసాయి సహా మరో యువకుడు కారణమని భావించిన బంధువులు, గ్రామస్తులు ఆ ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. గ్రామస్తుల దాడిలో శ్రీసాయి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి సంబంధించి 21 మందిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. కేసు విచారణలో భాగంగా బుధవారం తెనాలి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. మొత్తం 21 మంది నిందితుల్లో ఇప్పటికే నలుగురు మృతి చెందారు. మిగిలిన 17 మందిలో నలుగురికి కేసు నుంచి విముక్తి చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అలాతే మరో 13 మందిని నిందితులుగా తేలుస్తూ జిల్లా న్యాయమూర్తి జి.మాలతి యాజవజ్జీవ శిక్ష విధించారు.