Nakka Anand Babu: విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు..
ABN , First Publish Date - 2023-04-10T12:52:15+05:30 IST
బాపట్ల జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బాపట్ల జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు (Chandrababu) పాలనలో ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూశారని, ఏపీలో విద్యుత్ వాడుకొని పక్క రాష్ట్రాలకు అమ్మే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. జగన్‌కు మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పజెబితే లోటు విద్యుత్‌కు తెచ్చారని దుయ్యబట్టారు. జగన్ విద్యుత్ కొనుగోలులో రూ. 12 వేల కోట్లు కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.
మోటర్లకు మీటర్లు పెట్టి రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారని, కేంద్ర ఇచ్చే డబ్బులకు సీఎం జగన్ (CM Jagan) కక్కుర్తిపడి మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారని నక్కా ఆనందబాబు అన్నారు. కమీషన్లు దండుకోవటం కోసం, బినామీలకు దోచి పెట్టడం కోసమే జగన్ పని చేస్తున్నారని విమర్శించారు. ఆదాని (Adani)తో ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రజల సొమ్ము అప్పజెబుతున్నారని ఆరోపించారు. 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత జగన్ రెడ్డిదేనన్నారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు గాని చార్జీలు పెంచటం గాని లేదన్నారు. దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చిన ఘనత జగన్ రెడ్డిదేనన్నారు. జగన్ హయాంలో విద్యుత్ రంగంలో ఒక్క సబ్ స్టేషన్ కట్టింది లేదన్నారు. చిన్న చిన్న పరిశ్రమలు బ్రతక లేని పరిస్థితని.. పెద్ద కంపెనీలు రాష్ట్రం విడిచి పారిపోతున్నాయన్నారు. జగన్ రెడ్డిని ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు.