AP News: ఇప్పటంలో టెన్షన్.. టెన్షన్

ABN , First Publish Date - 2023-03-04T10:58:05+05:30 IST

జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

AP News: ఇప్పటంలో టెన్షన్.. టెన్షన్

గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటం (Ippatam)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో నోటీసులు ఇచ్చిన 8 కట్టడాలను తొలగించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇప్పటంలో పోలీసులు (Police) భారీగా మోహరించారు. అయితే కూలీ నాలీ చేసుకుని కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చేస్తుండటంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ ఆవేదనను పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

గతంలో ఇదే గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో అధికార యంత్రాంగం కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా మరోసారి మిగిలిన ఎనిమిద ఇళ్ల కూల్చివేత కోసం అధికారులు చర్యలు చేపట్టారు. వారంరోజుల క్రితమే ఈ ఎనిమిది ఇళ్లను కూల్చేందుకు అధికారులు రాగా... స్థానికులు మున్సిపల్ కమిషనర్‌కు కలిసి కొంతసమయం కోరడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

గ్రామస్థులు అడిగిన సమయం నేటితో ముగియడంతో ముందస్తు సమాచారం ఇచ్చి ఈరోజు మరోసారి కూల్చివేసేందుకు అధికారులు ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. అయితే ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొందరు కూల్చేసమయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి కట్టుకున్న తమ ఇంటికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా, కక్ష పూరితంగా కూల్చివేస్తున్నారంటూ ఆవేదన చెందారు. కాగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల జోక్యం లేకుండా అధికారులే గ్రామస్తులకు సర్దిజెప్పేందుకు యత్నిస్తుండగా.. వారు ససేమిరా అంటున్నారు. దీంతో అధికారులు వారి ఆవేదనను పట్టించుకోకుండా ఇళ్ల కూల్చివేతలను కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-03-04T11:03:10+05:30 IST