Share News

Chandrababu health: వైద్యుల నివేదికపై ఎందుకీ గోప్యం?..

ABN , First Publish Date - 2023-10-17T03:26:57+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల నివేదిక ఇంతవరకూ ఆయన కుటుంబ సభ్యులకు అందలేదు.

Chandrababu health: వైద్యుల నివేదికపై ఎందుకీ గోప్యం?..

కుటుంబ సభ్యులకు అందని బాబు వైద్య పరీక్షల నివేదిక

అధికారికంగా ఇచ్చేందుకు జైలు అధికారుల నిరాకరణ

ఏసీబీ కోర్టులోనూ న్యాయాధికారి నిస్సహాయత

అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల నివేదిక ఇంతవరకూ ఆయన కుటుంబ సభ్యులకు అందలేదు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఆయనకు ఈ నెల 12వ తేదీన ప్రభుత్వ వైద్యుల బృందం పరీక్షలు చేసి మర్నాడు రిపోర్టును జైలు అధికారులకు అందజేసింది. 14వ తేదీన మళ్లీ పరీక్షలు చేసి అదే రోజు నివేదిక ఇచ్చారు. అయితే తాజా రిపోర్టు ప్రతిని జైలు అధికారులు బాబు కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. లిఖితపూర్వకంగా కోరినా స్పందించలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్పుడప్పుడూ హెల్త్‌ బులెటిన్లను విడుదల చేస్తున్నా వాటిలో వైద్య పరీక్షల వివరాలు ఉండడం లేదు. నివేదిక తమకివ్వకపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


‘జైలు అధికారులు ఆయన ఆరోగ్య పరీక్షల వివరాలు దాచి పెడుతున్నారు. పారదర్శకంగా ఉండడం లేదు. ఆయన డీహైడ్రేషన్‌కు గురయ్యారని మొదట వార్తలు వచ్చాయి. జైలు అధికారులు దానిని ఖండించి అటువంటిదేమీ లేదన్నారు. రెండ్రోజుల తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన డీహైడ్రేషన్‌కు గురైన మాట వాస్తవమేనని అంగీకరించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు చల్లటి వాతావరణం కల్పించాలని వైద్యులు సూచించారు. దానిని జైలు అధికారులు దాచిపెట్టారు. వైద్యుల నివేదిక అనధికారికంగా బయటకు రావడం.. కోర్టు దృష్టికి వెళ్లడం.. కోర్టు ఆదేశాలిచ్చాక ఆయన గదికి ఏసీ సౌకర్యం కల్పించారు. హెల్త్‌ బులెటిన్‌లో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలూ ఇవ్వడం లేదు. తమకు కావలసినవి మాత్రమే ఇస్తున్నారు’ అని చంద్రబాబు కుటుంబ సన్నిహిత వర్గాలు ఆరోపించాయి.


జైలు అధికారులపై జగన్‌ ప్రభుత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని, లేకపోతే కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షల నివేదిక ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. ‘వైద్య పరీక్షల నివేదిక ఒకటి అనధికారికంగా బయటకు వచ్చింది. అది నిజమో.. లేదంటే ఏవైనా మార్పుచేర్పులు చేశారో తెలియదు. అధికార ప్రతి ఉంటే మేం దానిని మా వ్యక్తిగత వైద్యులకు చూపించి చంద్రబాబుకు చేయాల్సిన చికిత్స, వాడాల్సిన మందులపై వాళ్ల సలహా తీసుకుంటాం. కాపీ ఇవ్వకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించాయి.

Updated Date - 2023-10-17T09:24:14+05:30 IST