Alla Ramakrishna Reddy: జగన్ కీలక భేటీకి డుమ్మా కొట్టిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల తాజా వ్యాఖ్యలివి..
ABN , First Publish Date - 2023-04-04T13:34:41+05:30 IST
పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
గుంటూరు: సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం సమీక్ష సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna Reddy) డుమ్మాకొట్టారు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పార్టీ మారతారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ (CM Jagan Mohan Reddy) వెంటే... లేకపోతే పొలం బాట అని చెప్పుకొచ్చారు. అనారోగ్య సమస్యతో నిన్న సీఎం సమావేశానికి హాజరుకాలేదని తెలిపారు. తనకు ఎప్పటికి నాయకుడు జగన్ రెడ్డే (AP CM) అని అన్నారు. అవసరమైతే పొలం పనులు చేసుకుంటాను తప్ప బాస్‌ను ఎదురించనని అన్నారు. తమ నాయకుడు జగన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని ఆళ్ల రామకృష్ణ (YCP MLA) పేర్కొన్నారు.
కాగా... ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన వర్క్‌షాప్‌కు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి డుమ్మా కొట్టడం విస్మయాన్ని కలిగించింది. క్యాంపు కార్యాలయం తన నియోజకవర్గ పరిధిలో.. కూతవేటు దూరంలోనే ఉన్నా కొంతకాలంగా ఆయన అటు వైపే వెళ్లడం లేదని... ఆ గడప తొక్కడానికి కూడా ఇష్టపడడం లేదని వార్తలు వినిపించాయి. జగన్‌తో అగాధం పెరగడమే దీనికి కారణమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. జగన్‌కు మద్దతుగా ఆళ్ల అనేక మందిపై కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు కూడా. అంతటి వీరాభిమాని కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారని... అలాగని బయటపడకుండా మౌనముద్ర దాల్చారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలన్నీ ఆళ్ల ఒక్క సమాధానంతో పటాపంచలైపోయాయి. తన బాస్ జగన్ రెడ్డే అని... రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని.. ఒకవేల లేని పక్షంలో పొలం పనులు చేసుకుంటానే తప్ప వేరే పార్టీలోకి వెళ్లే ప్రస్తక్తే లేదని చెప్పడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడినట్లైంది.