Nara Lokesh: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఊహించని పరిణామం.. న్యాయమూర్తికి ఏజీ ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2023-09-29T12:05:18+05:30 IST

ఇన్నిర్ రింగ్ రోడ్ (IRR) అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించిన అక్రమ కేసులో ఏపీ హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సీఆర్‌పీసీలోని 41ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు.

Nara Lokesh: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఊహించని పరిణామం.. న్యాయమూర్తికి ఏజీ ఏం చెప్పారంటే..

అమరావతి: ఇన్నిర్ రింగ్ రోడ్ (IRR) అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించిన అక్రమ కేసులో ఏపీ హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ14గా చేర్చిన నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సీఆర్‌పీసీలోని 41ఏ కింద లోకేష్‌కు నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్‌లో మార్పు చేశారని కోర్టుకు నివేదించారు. 41ఏ నిబంధనలు పూర్తిగా పాటిస్తామని, విచారణకు సహకరించకపోతే కోర్టు దృష్టికి తీసుకొస్తామని ఏజీ వివరించారు. దీంతో సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ ప్రస్తావన రాదు కాబట్టి ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. దీనినిబట్టి ముందస్తు బెయిల్‌కు ఆస్కారమున్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించి ఉండొచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం నిర్ధారణ కావాల్సి ఉంది.


కాగా... ఇన్నిర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసులో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ని ఏ14గా చేర్చుతూ రెండు రోజులక్రితం సీఐడీ అధికారులు విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మెమో ఫైల్ చేసిన తర్వాత లోకేష్ న్యాయవాదులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండురోజుల క్రితం దాఖలు చేయగా శుక్రవారం పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి సీఐడీ అధికారులకు కోర్టు నోటీసులు ఇస్తారు. కానీ విచారణ ఆరంభమైన వెంటనే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి మార్పులు చేశారని కోర్టుకు చెప్పారు.

సీఆర్‌పీసీ 41ఏకి (7 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు) సంబంధించిన నిబంధనలను పాటిస్తామని చెప్పారు. ఒకవేళ లోకేష్ విచారణకు సహకరించక అరెస్ట్ చేయాల్సి వస్తే కోర్ట్ అనుమతి తీసుకున్నాకే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఈ కారణంగానే లోకేష్‌కు 41ఏ నోటీసు ఇస్తామని న్యాయమూర్తికి అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. కాగా లోకేష్ ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేశారు కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసివుంటారని, ఇప్పుడు అవి పక్కన పెట్టి ఉంటారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఇంకా నిర్ధారణకాలేదని, వివరాలు తెలియాల్సి ఉందని అంటున్నారు. తాజా ఎఫ్‌ఐఆర్‌లో అధికారులు ఏమేమీ పేర్కొన్నారనేది వెల్లడి కావాల్సి ఉంది.

Updated Date - 2023-09-29T12:59:13+05:30 IST