Heavy rain: ఆగని వర్షం... అన్నదాత విలవిల

ABN , First Publish Date - 2023-05-03T21:21:08+05:30 IST

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఒకమోస్తరు నుంచి భారీవర్షం (Heavy rain) కురిసింది. కంకిపాడులో 104.0 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

Heavy rain: ఆగని వర్షం... అన్నదాత విలవిల

మచిలీపట్నం: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఒకమోస్తరు నుంచి భారీవర్షం (Heavy rain) కురిసింది. కంకిపాడులో 104.0 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. బుధవారం మధ్యాహ్నం సమయం వరకు పలుప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా రెండు జిల్లాలలోని రైతులు కల్లాల్లో, పొలంలో ఆరబెట్టిన పసుపు, మిర్చి, మొక్కజొన్న నీటిలోనే ఉండిపోయింది. తోట్లవల్లూరు, కంకిపాడు, చల్లపల్లి తదితర మండలాల్లో మొక్కజొన్న మొలకలు వచ్చిపాడయ్యేస్థితికి చేరుకుంది. బాపులపాడు, కంకిపాడు, ఉంగుటూరు (Kankipadu Unguturu), గన్నవరం, ఉయ్యూరు తదితర మండలాల్లో ఈ రబీ సీజన్‌లో 10 వేల ఎకరాలకు పైగా సాగుచేసిన వరి అధికశాతం నేలకొరిగి వరికంకులు మొలకలు వస్తున్నాయి. కంకిపాడు తోట్లవల్లూరు. పెనుమలూరు ప్రాంతాల్లో బుధవారం నాటికి 90 ఎకరాల్లో అరటితోటలు దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో మామిడి పంట భారీగా దెబ్బతింది.

రాష్ట్రవ్యాప్తంగా నాలుగేళ్లుగా వరుస విపత్తులు రైతులు బాగా కుంగదీశాయి. పంట పండినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. విపత్తులతో వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సాగు పెట్టుబడులకు అదనంగా కౌలు చెల్లించే కౌలురైతులకు ఈ విపత్తులు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి అంచనాలే తప్ప.. వాస్తవంగా దిగుబడి ఎంతొచ్చింది? రైతుకు మిగిలిందెంత? అనేది పాలకులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవట్లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. కాగా, మంగళవారం కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరో మూడ్రోజులు వర్ష సూచన, వచ్చే వారం వాయుగుండం హెచ్చరికలు రైతుల గుండెల్లో పెను తుఫాన్‌ సృష్టిస్తోంది.

Updated Date - 2023-05-03T21:21:08+05:30 IST