Jana Sena-BJP: ఏపీలో బీజేపీ-జనసేన మధ్య స్నేహం ముగిసిన అధ్యాయమేనా?
ABN , First Publish Date - 2023-03-21T18:26:23+05:30 IST
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో బీజేపీ-జనసేన(JanaSena-BJP) మధ్య స్నేహం ముగిసిన అధ్యాయంగా మారిందా.?
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో బీజేపీ-జనసేన(JanaSena-BJP) మధ్య స్నేహం ముగిసిన అధ్యాయంగా మారిందా.? తాజా పరిస్థితులు చూస్తుంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ, జనసేన పొత్తుపై బీజేపీ నేత మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు. ఇరుపార్టీలు కలిసి పనిచేసే దిశగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan), నాదేండ్ల మనోహర్ ఆలోచించాలని మాధవ్(Madhav) సూచించారు. లేకపోతే పేరుకే రెండు పార్టీల పొత్తు అని జనం అనుకుంటారని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 5 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉత్తరాంధ్రలో అయితే చెల్లని ఓట్లకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు జనసేనాని ప్రచారం చేయలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే పార్టీ రాష్ట్ర అధినాయకత్వం పవన్‌ను అడగనేలేదనే ప్రచారం జరుగుతోంది. పొత్తుల గురించి హై కమాండ్ చూసుకుంటుందని మాధవ్ చెప్పారు.
మరోవైపు ఏపీ బీజేపీ పదాధికారులతో బీజేపీ అధినాయకత్వం సమావేశమై పార్టీ పనితీరు, ఎమ్మెల్సీ ఫలితాలపై చర్చించింది. జనసేన వ్యవహార శైలిపైనా చర్చించినట్లు సమాచారం. ఎన్నికల్లో వ్యూహం లేకుండా పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. మొన్నటికి మొన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతూ బీజేపీతో పొత్తు కొనసాగించాలా వద్దా అంటూ పార్టీ శ్రేణులను ప్రశ్నించారు. అప్పుడే బీజేపీ-జనసేన మధ్య స్నేహం ముగిసిన అధ్యాయమేనని రాజకీయ పరిశీలకులు ఊహించారు. ఇవాళ బీజేపీ నేత మాధవ్ కూడా జనసేన అంటీ అంటనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించి కలకలం రేపారు.
మే నెలలో వైసీపీ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ వేస్తామని, వైసీపీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని ఏపీ కమలనాథులు అంటున్నారు. రాష్ట్రంలో ఒంటరిగా ఎదగాలనుకుంటున్నామన్నారు. 2019లో 173 స్థానాల్లో పోటీ చేయగా బీజేపీకి 0.84 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
మరోవైపు రాష్ట్ర నాయకత్వంలో మార్పులుంటాయనే ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీతో స్నేహ బంధం తెంచుకుంటోన్న జనసేన తెలుగుదేశం పార్టీతో(JanaSena-TDP) దోస్తీ చేసేందుకు ఉవ్విళ్లూరుతోందని రాజకీయ పరిశీలకులంటున్నారు.