Nadendla Manohar: నవంబర్ 1 నుంచి ఇంటింటికీ టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో
ABN , First Publish Date - 2023-10-26T22:41:21+05:30 IST
జనసేన జిల్లా అధ్యక్షులతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: జనసేన జిల్లా అధ్యక్షులతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 29, 30, 31 తేదీల్లో జనసేన - టీడీపీ జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతాయని, భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా పోరాటాలే అజెండాగా చర్చిస్తామన్నారు. పార్టీ తరఫున ఆయా జిల్లాల పరిధిలోని ఇన్‌ఛార్జీలతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు 50 మంది సమావేశంలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆయన అన్నారు.
"జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాలు సుహృద్భావ వాతావరణం మధ్య నిర్వహించుకోవాలి. భవిష్యత్తు ప్రజా పోరాటాలు, ఆందోళనల్లో కలసికట్టుగా ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందించుకోవాలి. నవంబర్ 1వ తేదీ నాటికి ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంతో పాటు టీడీపీ సూపర్ సిక్స్ లో ప్రకటించిన అంశాలను కలిపి ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సంతకాలతో ముద్రించిన కరపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ రెండు పార్టీలు కలవకూడదన్నఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారు. వారి ప్రచారం, అనుచిత వ్యాఖ్యల ఉచ్చులో పడవద్దు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలను మాత్రమే ముందుకు తీసుకువెళ్లాలి. రాష్ట్ర శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే టిడిపి తో కలిసి వెళుతున్నాం. బీజేపీ కూడా కలసి రావాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ వరకు మన కార్యాచరణ స్పష్టంగా ఉంది. మొదటి అంశంగా రైతులు తీవ్రమైన నీటి కొరత సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల వద్దకు వెళ్లి ఫీల్డు రిపోర్టులు ఎలా సిద్ధం చేయాలి అనే అంశం మీద కార్యాచరణ రూపొందిస్తున్నాం." అని నాదెండ్ల మనోహర్ అన్నారు.