Viveka Case : నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి..
ABN , First Publish Date - 2023-05-05T10:53:02+05:30 IST
నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు అయిన ఎర్ర గంగిరెడ్డి వచ్చారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయేందుకు సీబీఐ కోర్టుకు చేరుకున్నారు.
హైదరాబాద్ : నాంపల్లి సీబీఐ కోర్టుకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు అయిన ఎర్ర గంగిరెడ్డి వచ్చారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయేందుకు సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో కోర్టులో లొంగిపోనున్నారు. ఐదో తేదీలోపు లొంగి పోవాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేడు ఆయన లొంగిపోనున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేశారు. ఆ తర్వాత 90 రోజులు గడచినా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది జూన్ 27న గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఏపీ పోలీసుల దర్యాప్తు ఆశించిన స్థాయిలో లేదని.. కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు సీబీఐకి అప్పటించింది. తదనంతరం గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరగా... కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ పిటిషన్‌పై మెరిట్ ఆధారంగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలంటూ కేసును మళ్లీ ఏపీ హైకోర్టుకు రిమాండ్ చేసింది. తదనంతర పరిణామాల్లో వివేకా హత్య కేసు దర్యాప్తు తెలంగాణకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు.. అక్కడి నుంచి తాజాగా తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. బదిలీ అయిన తర్వాత కేసు విచారణ ఊపందుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డికి ఐదో తేదీ లోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.