Avinash In Viveka Case : సీబీఐ కార్యాలయానికి బయలుదేరి.. పులివెందుల దారి పట్టిన అవినాష్ రెడ్డి.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2023-05-19T11:06:59+05:30 IST
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. గత విచారణ సమయంలో ట్విస్ట్ ఇచ్చిన మాదిరిగానే.. నేడు కూడా ఇవ్వడం గమనార్హం. సీబీఐ కార్యాలయానికి బయలుదేరి.. ఆయన పులివెందుల దారి పట్టారు. తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆసుపత్రిలో చేరారని ఫోన్ రావడంతో ఆయన పులివెందులకు బయలుదేరారు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. గత విచారణ సమయంలో ట్విస్ట్ ఇచ్చిన మాదిరిగానే.. నేడు కూడా అదే ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. సీబీఐ కార్యాలయానికి బయలుదేరినట్టే బయల్దేరి.. మార్గమధ్యలోనే హుటాహుటిన ఆయన పులివెందుల దారి పట్టారు. ఎంపీ తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంతో పులివెందుల ఆసుపత్రిలో చేరారని ఫోన్ రావడంతో ఆయన పులివెందులకు బయలుదేరారు. కాాగా శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.
వాస్తవానికి.. ఉదయం నుంచి కూడా అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా.. లేదా? అనేది సందిగ్ధంగానే ఉంది. విచారణకు హాజరు కావాల్సిన సమయం ఆసన్నమైనా కూడా ఆయన తన న్యాయవాదులతో విచారణకు వెళ్లాలా.. వద్దా.. అనేదానిపై చర్చలు నిర్వహిస్తూ ఉండిపోయారు. చర్చలు ముగిశాక వెంటనే తన కాన్వాయ్‌లో బయలు దేరారు. మీడియా మొత్తం ఆయన సీబీఐ కార్యాలయానికే బయల్దేరారనే అనుకుంది. కానీ ఆయన పులివెందుల రూటు పట్టారు. గత విచారణ సమయం(ఈ నెల 16న)లోనూ అవినాష్ రెడ్డి అలాగే చేశారు. విచారణకు హాజరవుతున్నట్టుగా కారులో బయలుదేరి వెంటనే పులివెందుల దారి పట్టారు. ఈ పరిస్థితుల్లో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేదానిపై సర్వత్రా అవినాష్ అనుచరుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.