AP News: ఈ ఆరుద్రకు న్యాయం జరిగేది ఎప్పుడో?... సీఎం ఆదేశించినప్పటికీ...
ABN , First Publish Date - 2023-02-21T09:26:18+05:30 IST
ఓ తల్లి అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోసం ఎంతగానో పోరాడుతోంది.
కాకినాడ: ఓ తల్లి (Mother) అనారోగ్యంతో ఉన్న బిడ్డ (Daughter) కోసం ఎంతగానో పోరాడుతోంది. పుట్టుకతోనే తీవ్ర అనారోగ్యంతో పుట్టిన కన్న కూతురిని రక్షించుకునేందుకు తన ఇంటిని కూడా అమ్మేందుకు సిద్ధపడింది. అయితే తన సొంత ఇంటిని అమ్మేందుకు కూడా ఆమెకు అనేక అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీసోడి (Police) కన్ను ఆమె ఇంటిపై పడింది. ఆ ఇంటిని తనకే అమ్మాలంటూ తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేస్తున్నాడు. చివరకు తనకు న్యాయం చేయాలంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ (CM Camp Office) వద్ద ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది ఆ తల్లి. అయితే సీఎం ఆదేశించినప్పటికీ న్యాయం జరగలేదు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.
వివరాల్లోకి వెళితే... కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మీ చంద్ర పుట్టుకతోనే వెన్నుముక సమస్యతో బాధపడుతోంది. దీంతో కుమార్తె వైద్యం కోసం అన్నవరంలోని ఇంటిని అమ్మేందుకు కొంతకాలంగా ఆరుద్ర ప్రయత్నం చేస్తోంది. కాగా... పక్కన ఉండే కానిస్టేబుల్ ఆ ఇంటిని అమ్మనివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు. రూ. 40 లక్షలు విలువ చేసే ఇంటిని రూ.10లక్షలకు తమకే అమ్మాలంటూ వేధిస్తున్నారంటూ సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వారికి పోలీసు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతేడాది నవంబర్‌లో సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jagan Reddy) ని కలిసి తమ బాధను చెప్పి న్యాయం చేయాలని కోరేందుకు వెళ్లగా.. అక్కడ అధికారులు అడ్డుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై చేయి కోసుకుంది. వెంటనే అధికారులు అప్రమత్తమై ఆరుద్రను ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలిసిన సీఎం జగన్ (CM Jagan) ఆరుద్రకు న్యాయం చేయాలని ఆదేశించారు. అయితే సీఎం ఆదేశించినా తనకు న్యాయం జరగడం లేదని మహిళ విలపిస్తోంది. ఇప్పటికీ కానిస్టేబుల్ వేధిస్తున్నారని.. పెట్టిన కేసు ముందుకు తీసుకువెళ్లడం లేదని పేర్కొంది. సీఎంను కలిసినా న్యాయం జరగకపోతే ఎలా బతకాలని ఆవేదన చెందుతోంది. చచ్చిపోతే అయినా న్యాయం చేస్తారా అని ప్రశ్నిస్తోంది. ఏడు నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన బాధను సోషల్ మీడియాలో వివరిస్తూ ఆరుద్ర కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఆరుద్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.