BJP Leader: సీఎం జగన్ ఢిల్లీకి రావడం వెనక కారణాలేంటో చెప్పిన బీజేపీ నేత
ABN , First Publish Date - 2023-03-31T12:47:47+05:30 IST
ఏపీ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీ (Andhrapradesh) పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి (BJP spokesperson Bhanuprakash Reddy, ) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి అన్నపూర్ణగా దేశంలో ప్రత్యేకత ఉండేదని... కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయన్నారు. ఏపీలో ఆర్ధిక ఎమెర్జెన్సీ వచ్చే అవకాశం ఉందని.. అందుకు కారణం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) అని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే జగన్‌కు ఢిల్లీలో అపాయింట్మెంట్‌లు లభిస్తున్నాయని వివరణ ఇచ్చారు. జగన్‌తో కానీ, ఆయన పార్టీతో కానీ బీజేపీకి స్నేహ సంబంధాలు లేవన్నారు. బీజేపీ - వైఎస్సార్ పార్టీల మధ్య సంబంధాలు కేవలం కేంద్ర - రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు మాత్రమే అని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఫాన్‌కు ఎదురుగాలి వీయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
ఏపీకి ఆర్థిక మంత్రి లేరని.. అప్పుల మంత్రి మాత్రమే ఉన్నారని యెద్దేవా చేశారు. రాష్ట్రంలో కేవలం అభివృద్ధి కేంద్ర నిధుల వల్లనే జరిగిందన్నారు. కేంద్ర పథకాలకు జగన్ తన పేరు, తండ్రి పేరు పెట్టుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్ (CM Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదన్నారు. మంత్రులు, శాసనసభ్యులు తమ గురించి ఆలోచిస్తున్నారే తప్ప, ప్రజల గురించి ఆలోచించడం లేదని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు 9 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. రెండు పార్టీల ప్రభుత్వాల వల్ల పోలవరం ఆలస్యం అవుతోందని.. ఆ కారణాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెడుతున్నారని బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు ఎక్కువ అయ్యాయన్నారు. ఓట్లకోసం జగన్ మోహన్ రెడ్డి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూమతంపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ముఖ్యమంత్రి జగన్ కోల్పోయారని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసిన వారు తమ ఓటర్లు కాదని సజ్జల మాట్లాడిన మాటలు విస్మయాన్ని కలిగిస్తున్నాయన్నారు. కేరాఫ్ అడ్రస్ లేని నారాయణ పార్టీ లాంటి వాళ్లు బీజేపీ గురించి మాట్లాడడం ఆశ్చర్యం కల్గిస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వ అప్పులపై త్వరలో ఛార్జిషీట్ వేయనున్నట్లు చెప్పారు. అప్పులపై ప్రభుత్వం వెంటనే ఛార్జిషీట్ ప్రకటించాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు.