Chandrababu Naidu: యువకుడు అంజన్ అరెస్ట్‌పై స్పందించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2023-03-30T15:22:12+05:30 IST
గన్నవరం ఎన్ఆర్‌ఐ యువకుడు అంజన్ అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
అమరావతి: గన్నవరం ఎన్ఆర్‌ఐ యువకుడు అంజన్ అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు. బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy)పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని అంజన్‌ను నిన్న (బుధవారం) తీసుకువెళ్లిన పోలీసులు ఇప్పటికీ అతని ఆచూకీ చెప్పకపోవడం నిబంధనల ఉల్లంఘనే అని అన్నారు. వెంటనే తప్పుడు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని.. అంజన్‌ను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
కాగా... సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన కారణంగా గన్నవరానికి చెందిన పొందూరి అంజన్ (35)ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే అంజన్‌ను పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియాల్సి ఉంది. కుమారుడు అరెస్టుపై వృద్ధ దంపతులు ఆవేదన చెందుతున్నారు. అమెరికాలో మెకానికల్ నెట్వర్‌కు ఇంజనీర్ చేసి స్వదేశానికి వచ్చిన అంజన్.. కొంతకాలంగా గన్నవరంలో తన నివాసంలో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సీఎం జగన్ సర్కారుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏకంగా పదిమంది పోలీసులు అంజన్ నివాసంపై దాడి చేసి అంజన్‌ను తీసుకెళ్లారు. అంజన్ నివాసంలో లాప్టాప్, సెల్ ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంజన్ అరెస్టుపై తల్లి రత్నకుమారి కన్నీరు మున్నీరవుతున్నారు. అరెస్ట్ అయిన తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడో ఒక్కసారి చూపించమంటూ ప్రాధేయపడుతున్నారు. పోస్టింగ్‌పై సీఎం కార్యాలయం నుంచి ఒత్తిడి ఉంది అని పోలీసులు అనుకుంటుంటే విన్నాను అని కన్నతల్లి రత్నకుమారి వెల్లడించారు. కట్టుబట్టలతో తన కుమారుని తీసుకువెళ్లారని తెలిపారు. అంజన్ ఆచూకీపై గన్నవరం పోలీసులు సరైన క్లారిటీ ఇవ్వడం లేదని కన్నతల్లి రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు.