AP News: కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఆందోళన
ABN , First Publish Date - 2023-04-03T13:05:43+05:30 IST
ఆర్టీసీలో అర్హత కల్గిన వారందరికీ కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనకు దిగారు.
విజయవాడ: ఆర్టీసీ (APSRTC)లో అర్హత కల్గిన వారందరికీ కారుణ్య నియామకాలు ( compassionate appointments) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనకు దిగారు. 2016 ముందు విధినిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు సోమవారం ఉదయం ఆర్టీసీ హౌస్ ముందు నిరసన చేపట్టారు. తమకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 2016 తర్వాత ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలిచ్చి తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016 ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకూ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నోఏళ్లుగా తాము కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీ హౌస్ ముందు ఆందోళన చేస్తోన్న బాధితులు తమతో పాటు పెట్రోల్ బాటిళ్లు తీసుకువచ్చారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని చెబుతున్నారు. ఉద్యోగాలు లేక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.