Vijayawada: గొల్లపుడిలో ఉద్రిక్తత.. దేవినేని ఉమ అరెస్ట్..
ABN , First Publish Date - 2023-08-30T09:16:09+05:30 IST
విజయవాడ: గొల్లపుడిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విజయవాడ: గొల్లపుడిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇసుక సత్యాగ్రహ దీక్ష కార్యక్రమంలో భాగంగా మూడవరోజు బుధవారం ఇబ్రహీంపట్నం డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ ఆఫీసుకు టీడీపీ నేతలను వెళ్ళకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. దేవినేని ఉమను హౌస్ అరెస్టు చేయగా గొల్లపూడిలోని తన నివాసం వద్దనే నిరసన తెలిపారు. ఏపీని దోచేస్తున్న వైసీపీ ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు దేవినేని ఉమ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. అర్ధరాత్రి నుంచి దేవినేని ఇంటి వద్ద పోలీసులు పహార కాస్తున్నారు.
దేవినేని ఉమ కామెంట్స్:
ఆనాడు ఉప్పు సత్యాగ్రహం గాంధీ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో ఇసుక సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని దేవినేని ఉమ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి కొత్తపాలసి తీసుకువస్తానంటే ప్రజలందరూ నమ్మారన్నారు. వైసీపీ నాయకులు మైనింగ్ డిపార్టుమెంట్‌ను అడ్డంపెట్టి రెండు సంవత్సరాలు ఇసుక దోపిడి చేసి డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కట్టారన్నారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే రూ. 21 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కట్టారన్నారు. ఈరోజు టీడీపీ పిలుపుమేరకు మైనింగ్ డైరెక్టర్‌ను కలిసేందుకు ఇబ్రహీంపట్నం వెళ్ళనివ్వకుండా పోలీసులను మైనింగ్ డిపార్టుమెంట్ వద్ద కాపలా పెట్టారని, సామాన్యుడు, పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా వ్యవస్థ మొత్తం కుప్పకూలిందని విమర్శించారు. మైలవరంలో ఎమ్మెల్యే పిఏలు నారాయణ బుజ్జులు, గజ్జలు ఇలా ఇసుకను దోచేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఇబ్రహీంపట్నం వెళ్లి తాము వినతి పత్రం అందజేస్తామంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. పోలవరాన్ని ముంచేశారని, ఆ విషయాలను ఈనాడులో రాస్తే రాసిన పత్రిక వాళ్లను జైల్లో పెట్టించారని మండిపడ్డారు. రూ. 12 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు వెళ్లాయని, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని అన్నారు.
కాగా రాష్ట్రంలో అధికార పార్టీ ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇసుక దోపిడీపై 28, 29, 30 తేదీలలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.