Biswabhushan: గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్ బిశ్వభూషణ్‌కు వీడ్కోలు
ABN , First Publish Date - 2023-02-22T09:25:13+05:30 IST
గవర్నర్ బిశ్వభూషణ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం వీడ్కోలు పలికింది.
విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Governor Biswabhushan Harichandan) కు గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)లో ప్రభుత్వం (AP Government) వీడ్కోలు పలికింది. బుధవారం ఉదయం గవర్నర్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)ఆత్మీయ వీడ్కోలు పలికారు. బిశ్వభూషణ్ చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. రాష్ట్రాన్ని వీడుతున్నందుకు ఎంతోబాధగా ఉన్నప్పటికీ కేంద్రం తనకు మరో బాధ్యత అప్పగించిందన్నారు.
సీఎం జగన్ (AP CM) మాట్లాడుతూ... గవర్నర్‌గా, ఆత్మీయుడైన పెద్ద మనిషిగా గవర్నర్ వ్యవస్థకు బిశ్వభూషణ్ నిండుతనం తెచ్చారన్నారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా ఉండాలన్న దానిని ఆచరణలో గొప్పగా చూపించారని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం, తన తరపున ఆయనకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. సీఎస్ జవహర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేసిన ఈ కార్యక్రమంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajenderanath Reddy), గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ (Principal Secretary to the Governor Anil Kumar Singhal) పాల్గొన్నారు..
నేడు ఏపీకి కొత్త గవర్నర్
బిశ్వభూషణ్ బదిలీ అయిన నేపథ్యంలో ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈరోజు కొత్త గవర్నర్ ఏపీకి రానున్నారు. రాత్రి 7:30 గంటలకు గన్నవరంకు జస్టిస్ అబ్దుల్ నజీర్ చేరుకోనున్నారు. కొత్త గవర్నర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ఈనెల 24న ఏపీ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.