Ugadi: వైఎస్ జగన్ నివాసంలో ఉగాది ఉత్సవాలు.. సుబ్బరాయ సోమయాజులు పంచాంగం ఏంటంటే..
ABN , First Publish Date - 2023-03-22T12:58:38+05:30 IST
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద గల గోశాల ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)నివాసం వద్ద గల గోశాల ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలు (Ugadi Celebrations) వైభవంగా జరిగాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సర పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం కప్పగంతు సుబ్బరాయ సోమయాజులతో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. సీఎం వైఎస్ జగన్ దంపతులు పంచాంగ శ్రవణాన్ని విన్నారు.
సీఎంకు పాలనాపరంగా కలసి వస్తుంది: సోమయాజులు
శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని కప్పగంతు సుబ్బరాయ సోమయాజులు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు పండించే రైతులకు ఈ ఏడాది మంచి లాభాలు వస్తాయన్నారు. పాడి రైతులకు ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. వ్యవసాయం ,ఆర్థిక, విద్యాశాఖల్లో మంచి అభివృద్ది ఉంటుందన్నారు. సీఎంకు వ్యక్తిగతంగా, పాలనా పరంగా కలసి వస్తుందని అన్నారు. ఈ ఏడాదిలో విశేష ఫలితాలు వస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటుందని సోమయాజులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు.
ప్రజలందిరికీ మంచి జరగాలి: సీఎం జగన్
పంచాంగ పఠనం అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడాదంతా ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. సీఎం దంపతులకు పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం దంపతులు వీక్షించారు.