KA Paul: విశాఖ ఉక్కు కోసం ఎంతవరకైనా వెళతా..
ABN , First Publish Date - 2023-04-26T16:27:42+05:30 IST
విశాఖ ఉక్కు (Visakha Steel) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశానని, స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎంతవరకైనా వెళతానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) స్పష్టం చేశారు.
అమరావతి: విశాఖ ఉక్కు (Visakha Steel) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశానని, స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎంతవరకైనా వెళతానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) స్పష్టం చేశారు. బుధవారం ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశానన్నారు. తాను కోర్టులో న్యాయ పోరాటం చేసిన అన్ని కేసుల్లో విజయం సాధించానన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ఎవరూ కాపాడలేక పోయారని, విశాఖ ఉక్కు ప్రైవేట్ కరణ కాకుండా తాను అడ్డుకుంటానన్నారు.
ఇస్టానుసారంగా గంగవరం పోర్టు (Gangavaram Port)ను కూడా అమ్మేశారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రాణ త్యాగం చేయడానికి అయినా తాను సిద్ధమని కేఏ పాల్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) స్టీల్ ప్లాంట్ కొంటానన్నది పొలిటికల్ స్టంట్ మాత్రమేనని విమర్శించారు. రూ. 5 లక్షల కోట్లు తెచ్చి రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేశానని, రూ. 4వేల కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ కోసం నెల రోజుల్లో డొనేషన్ ఇస్తానన్నారు. తనకొచ్చే ఫండ్స్ రాకుండా ప్రభుత్వాలు నిలిపివేశాయన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల్లో బిజీగా ఉన్నారని, ఆ పార్టీ ఎలాగూ గెలవలేదని, తనతో కలిసి పోరాటం చేయాలని కేఏ పాల్ సూచించారు. విశాఖ ఉక్కు కోసం అందరం కలిసి పోరాటం చేద్దామన్నారు. ఇప్పటి వరకు కాపులు సీఎం అవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రజా శాంతి పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. చారిటీ డబ్బులు రాజకీయాల కోసం వాడకూడదు కాబట్టే తాను వినియోగించడంలేదని కేఏ పాల్ స్పష్టం చేశారు.