Somu Veerraju: కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరటంపట్ల స్వాగతిస్తున్నా..

ABN , First Publish Date - 2023-04-07T13:05:13+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) బీజేపీ (BJP)లో చేరటంపట్ల హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు.

Somu Veerraju: కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరటంపట్ల స్వాగతిస్తున్నా..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) బీజేపీ (BJP)లో చేరటంపట్ల హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్‌కు శుక్రవారం ఉదయం ఫోను చేసి శుభాకాంక్షలు తెలిపానన్నారు. ఆయనతో త్వరలోనే సమావేశమై రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై చర్చిస్తానన్నారు. కిరణ్ కుమార్ చేరికతో రాష్ట్రంలో బీజేపీ మరింత శక్తివంతమై ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

కాగా కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్ అందించారు. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీలోకి ఆహ్వానించారు.

కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్నారు. తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్.. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందన్నారు. విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందన్నారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు. బీజేపీ ఎదుగుతున్నకొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందన్నారు. 1980లో 7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్.. 2019లో 37 శాతానికిపైగా పెరిగిందని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తమది 1952 నుంచి కాంగ్రెస్ కుటుంబమన్నారు. అయితే ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలన్నారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యమన్నారు. గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే ఉందన్నారు. మోదీ, అమిత్‌షా డైరెక్షన్‌లో బీజేపీ దూసుకుపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అధిష్టానం తనకు ఏ పని అప్పగిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-07T13:05:13+05:30 IST