Jogi Ramesh Follower: అందినంత అప్పులు.. ఎగ్గొట్టేందుకు అదిరిపోయే ప్లాన్ వేశాడు!

ABN , First Publish Date - 2023-09-29T10:45:28+05:30 IST

కృష్ణానది వారధిపై తన ద్విచక్రవాహనం ఉంచి.. తాను చనిపోతున్నట్టు, కుటుంబసభ్యులు బాధ పడవద్దని, భార్య నవ్యశ్రీ తనను క్షమించాలని కోరుతూ లేఖ రాసిపెట్టాడు.

Jogi Ramesh Follower: అందినంత అప్పులు.. ఎగ్గొట్టేందుకు అదిరిపోయే ప్లాన్ వేశాడు!

  • మంత్రి జోగి అనుచరుడి ఆత్మహత్య డ్రామా!

  • పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఆదినారాయణ కేసు

  • బంగారం విడిపించానని బంధువులకు వాయిస్‌ మెస్సేజ్‌

  • అక్కడ పెట్టింది రోల్డ్‌గోల్డ్‌ నగలు

  • కాలువ ఒడ్డున బైక్‌ వదిలేసి.. గెటప్‌ మార్చి ఆటోలో పరారీ

  • సీసీ ఫుటేజీలతో నిగ్గుతేల్చిన పోలీసులు

పెడన, సెప్టెంబరు 28 : మంత్రి జోగి రమేశ్‌ (Minister Jogi Ramesh) అనుచరుడు ఆదినారాయణ ఆత్మహత్య డ్రామా వికటించింది. అప్పులు ఎగ్గొట్టేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు కథ నడిపి ఉత్తుత్తి సూసైడ్‌ నోట్‌ రాసిన విషయం ఇపుడు కలకలం రేపుతోంది. క్రికెట్‌ బెట్టింగ్‌, పేకాటల్లో అప్పులపాలైన యారగాని ఆదినారాయణ వాటి నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్య డ్రామా నడిపాడనే దిశగా పోలీసుల దర్యాప్తు సాగుతోంది. మంత్రి అండదండలతోనే ఆత్మహత్య నాటకానికి తెరలేపాడని బంధువులు, పోలీసులు భావిస్తున్నారు. పెడన మండలం కాకర్లమూడికి చెందిన ఆదినారాయణ గత నాలుగేళ్లుగా మంత్రి జోగి అనుచరుడిగా ఉంటున్నాడు. మంత్రి నియోజకవర్గానికి వస్తే ఆయన వెంటే ఉండి ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటాడు. ఈనెల 25వ తేదీ సాయంత్రం నుంచి ఆదినారాయణ అదృశ్యమయ్యాడు. ఈనెల 25వ తేదీ రాత్రి సమయంలో కోడూరు మండలం ఉల్లిపాలెం సమీపంలో కృష్ణానది వారధిపై తన ద్విచక్రవాహనం ఉంచి.. తాను చనిపోతున్నట్టు, కుటుంబసభ్యులు బాధ పడవద్దని, భార్య నవ్యశ్రీ తనను క్షమించాలని కోరుతూ లేఖ రాసిపెట్టాడు.

క్రికెట్‌ బెట్టింగ్‌, పేకాటకు అలవాటుపడి..

ఆదినారాయణ క్రికెట్‌ బెట్టింగ్‌, పేకాటల్లో భారీమొత్తంలో అప్పుల పాలైనట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మంత్రికి అనుచరుడిగా ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు కూడా చేశాడని, ఆ బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నట్టు బంధువులు చెబుతున్నారు. ఇటీవల కొంత పొలం విక్రయించి డాక్యుమెంట్లలో రాసి ఉన్న నగదుమొత్తాన్ని ఇంటిలో ఉంచి, మిగిలిన మొత్తాన్ని ఏం చేశాడనే అంశంపైనా చర్చ నడుస్తోంది. ఇటీవల అప్పులు తీర్చాలని బంగారు నగలు తీసుకుని కుదువ పెట్టినట్టు బంధువులు చెబుతున్నారు. తాను చనిపోతున్నానని, కుదువపెట్టిన నగలు విడిపించి, తన ద్విచక్రవాహనంలో ఉంచానని, వాటిని తీసుకోవాలని వారికి ఫోన్‌ ద్వారా వాయిస్‌ మెసేజ్‌ పెట్టినట్టు బంధువులు చెబుతున్నారు. కానీ అసలు నగలకు బదులుగా గిల్టు నగలను పెట్టడం గమనార్హం. ఆదినారాయణ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖరాసి అదృశ్యమైతే, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి కుటుంబసభ్యులు నింపాదిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

joe.jpg

వేషం మార్చి..

ఈ నెల 25న ఆదినారాయణ అదృశ్యం కావడం, తాను చనిపోతున్నట్టు, శవం దొరకదని, దొరికినా తన గ్రామం తీసుకువెళ్లవద్దని, సొంతగ్రామంలో అంత్యక్రియలు జరగడం తనకు ఇష్టం లేదని, వేరేప్రాంతంలో అంత్యక్రియలు పూర్తిచేయాలని లేఖలో పేర్కొన్నాడు. కృష్ణానది వారధిపై ద్విచక్ర వాహనం నిలిపి ఉంచడంతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించిన పోలీసులు రెండు పడవలతో గాలింపుచర్యలు చేపట్టారు. అయినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలించారు. బందరు మండలం చిన్నాపురం నుంచి బైక్‌పై కోడూరు మండలం ఉల్లిపాలెం-భవానీపురం వారధిపైకి చేరుకున్న ఆదినారాయణ అక్కడ ద్విచక్రవాహనాన్ని వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు. వారధిపై బైక్‌ను వదిలేసి ఎవరూ గుర్తించకుండా గెట్‌పమార్చి ఆటోలో కోడూరు గంగానమ్మ గుడి వద్ద దిగినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. నిక్కరుతో తలపై టోపీ, ముఖానికి మాస్కు, భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని కోడూరులో సంచరించినట్టు సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డయింది. దీంతో ఆదినారాయణ ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అప్పుల బారినుంచి బయటపడేందుకే ఆత్మహత్య డ్రామా ఆడినట్టు భావిస్తున్నారు. కాగా కోడూరు నుంచి ఎక్కడకు వెళ్లాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - 2023-09-29T10:48:48+05:30 IST